హైదరాబాద్ నగరంలోని ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో నగరవాసులు తడిసిముద్దయ్యారు. కోఠి, సుల్తాన్ బాజార్, బేగంబజార్, అబిడ్స్, సైఫాబాద్, లక్డీకపూల్, బషీర్‌బాగ్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో నీళ్లు రోడ్లపైకి చేరడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కుషాయిగూడ, చర్లపల్లి, దమ్మాయిగూడా, నాగారం, జవహర్‌నగర్‌లో... నాలాలు పొంగి రోడ్లపైకి నీరు చేరింది. కీసర ప్రధాన రహదారిపై మోకాల్ల లోతు నీరు చేరి భారీగా ట్రాఫిక్ జామయింది.
సాగర్‌రింగ్ రోడ్డులో పెద్ద ఎత్తున వర్షం నీరు ప్రవహించడం వల్ల... ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు కింద పడ్డారు. స్థానికులు, పోలీసులు గమనించి వారిని కాపాడారు. మన్సురాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆనంద్‌నగర్ వెళ్లే రోడ్డులో భారీగా నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మీర్పేట్ కార్పొరేషన్లో పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరగా... మంత్రి సబిత ఇంద్రారెడ్డి దగ్గరుండి సహాయక చర్యలు చేయించారు. ఎల్బీనగర్, నాగోల్, మన్సురాబాద్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో రోడ్డు జలమయమయ్యాయి.