Rains in Hyderabad:హైదరాబాద్‌లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు జనం తల్లడిల్లిపోతున్నారు. రోడ్లు ఏరులను తలపిస్తున్నాయి. నాలాలు, చెరువులను కబ్జా చేయడం వల్ల ఆకస్మిక వరదలు ఇళ్లను ముంచెత్తుతున్నాయి. సర్వం కోల్పొయిన బాధితులు సాయం కోసం అర్థిస్తున్నారు. నగర శివారులోని పేట్ బషీరాబాద్, అంగడిపేట పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. హైటెన్షన్ కాలనీతో పాటు పలు సమీప బస్తీల్లోకి వరద పోటెత్తడంతో జన జీవనం అస్తవ్యస్తమైంది.
చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా అపార్టుమెంట్‌ల నిర్మాణంతో వరద ముంచెత్తిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో వస్తువులన్నీ తడిచిపోయి... నిలువ నీడలేని దుస్థితి తలెత్తిందని వాపోతున్నారు. శైనాజ్ గంజ్ ఠాణా పరిధి బాల మైసమ్మ గోశాలలో విద్యుత్ వైర్లు తెగిపడి ఏడు గోవులు మృత్యువాత పడ్డాయి. బోరబండ ప్రాంతంలో నిలిచిన నీటిని డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. కొంపల్లి నుంచి దూలపల్లి వెళ్ళే రహదరిపై వర్షం నీరు పోటెత్తడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సుచిత్ర నుంచి కుత్బుల్లాపూర్ వెళ్ళే మార్గం వరద గుప్పిట్లో చిక్కుకుంది. కొంపల్లిలో వరదనీటి సమస్యను ఎమ్మెల్యే వివేకానంద పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.