తెలంగాణ

telangana

ETV Bharat / city

Heavy rains: 3 గంటల పాటు ఏకధాటిగా వర్షం.. చెరువులుగా మారిన రహదారులు - గుంటూరులో భారీ వర్షం

ఏపీలోని గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునిగాయి. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు ఎస్టీ కాలనీలోకి వరద నీరు చేరింది. అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈపూరు మండలం కొండ్రముట్లలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. కుప్పగంజి వాగు ఉద్ధృతికి ఓ యువకుడు కొట్టుకుపోగా అధికారులు రక్షించారు.

heavy-rains-in-guntur-district
heavy-rains-in-guntur-district

By

Published : Jul 18, 2021, 7:44 AM IST

గుంటూరు జిల్లాలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కుండపోత వానలు కురిశాయి. పల్లపు ప్రాంతాల్లోని కాలనీల్లోకి నీరు చేరింది. వాగులు పొంగిపొర్లాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయమేర్పడింది. చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులోని ఎస్టీ కాలనీలోకి నీరు చేరగా.. స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బాపట్ల మండలం మూలపాలెంలో జగనన్న కాలనీలోకి వాన నీరు చేరింది. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. ఈపూరు మండలం కొండ్రముట్లలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు.

జలమయమైన రహదారులు..

గుంటూరు నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. మూడు గంటలకు పైగా కురిసిన వానతో జనజీవనం స్తంభించింది. కుండపోత వర్షంతో రహదారులపైకి నీరు చేరింది. కొన్ని చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. దుకాణాల ముందుంచిన వాహనాలు సగం మేర నీటిలో మునిగాయి. వర్షపు నీటిలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిలకలూరిపేట మండలం మానుకొండవారి పాలెం-వేలూరు మధ్య ఉన్న కుప్పగంజి వాగు ఉద్ధృతికి చౌటుపల్లి దాసు అనే యువకుడు కొట్టుకొని పోగా..పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది అతడిని కాపాడారు.

గరిష్ఠంగా గుంటూరులోనే...

శుక్రవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల మధ్య గరిష్ఠంగా గుంటూరు జిల్లా బాపట్లలో 158.8 మి.మీ., గుంటూరు నగరంలో 145, పొన్నూరులో 142.5 మి.మీ. వర్షం కురిసింది. జిల్లాలోని ముప్పాళ్ల, రొంపిచర్ల, కర్లపాలెం, పొన్నూరు, కాకుమాను, శావల్యాపురం, ఈపూరు, యడ్లపాడు తదితర ప్రాంతాల్లోనూ వంద మి.మీ.కుపైగా వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో 70.25 మి.మీ., నాగులుప్పలపాడులో 61.75, కృష్ణా జిల్లా నూజివీడులో 59.5 మి.మీ.చొప్పున వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా నగరి, కడప జిల్లా చిట్వేలు, నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో మోస్తరు వానలు కురిశాయి.

తేలికపాటినుంచి మోస్తరు వానలు..!

వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లో 21వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో ఉత్తర కోస్తాలోనూ వానలు కురవనున్నాయి. తూర్పు, పడమర ద్రోణి ఉత్తర అరేబియా సముద్రంనుంచి దక్షిణతీర ప్రాంత ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా 3.1 కి.మీ.నుంచి 4.5 కి.మీ.మధ్య ఎత్తుతో దక్షిణ దిశగా వంగి ఉంది. ఈ ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి వానలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం తేలికపాటినుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందని పేర్కొంది.

ఇదీ చదవండి:MEDICAL STUDENTS: నాడి పట్టని భావి వైద్యులు.. ఏడాదిన్నరగా క్లినికల్స్‌, ప్రాక్టికల్స్‌కు దూరం

ABOUT THE AUTHOR

...view details