AP Rain News Today 2021 :ఏపీలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో చిత్తూరు, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. రాయలసీమ జిల్లాలను మరోసారి భారీ వానలు ముంచెత్తాయి. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కడపలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురిసింది. గత వరద నుంచి జిల్లావాసులు కోలుకోక ముందే మళ్లీ అల్పపీడనం ఏర్పడటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చెరువులన్నీ నిండిపోయి ఉండటంతో...వరదలకు తెగిపోయే ప్రమాదముందని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప శివారులోని ఊటుకూరు చెరువు తెగిందని వదంతులు వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కట్టమట్టి కాస్త జరగడంతో ఇసుక బస్తాలతో పటిష్ఠం చేశారు. జమ్మలమడుగు ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి.
చిల్లకూరులో అత్యధిక వర్షపాతం
Heavy Rain in Nellore : నెల్లూరు జిల్లా చిల్లకూరులో అత్యధికంగా 15.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. శ్రీకాళహస్తి మండలం కండ్రిగుంట చెరువుకు గండి పడింది. చిన్న చెరువు కావడంతో కొంతమేర పంటల నష్టం వాటిల్లింది తప్ప ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. రాయల చెరువు కట్ట పనులను కలెక్టర్ హరినారాయణన్‌తోపాటు జిల్లా ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న పరిశీలించారు. చంద్రగిరి మండలంలోని కల్యాణి డ్యాం నీటిమట్టాన్ని సైతం వారు పరిశీలించారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం(Tirupati Rains today)కురిసింది. దీంతో రెండు కనుమ దారులను ఆదివారం రాత్రి పదిగంటలకే తితిదే మూసివేసింది. చిత్తూరు జిల్లాలోని కాళంగి, అరణియార్ జలాశయాల గేట్లను ఎత్తివేశారు. శ్రీకాళహస్తి కైలాసగిరి పర్వతశ్రేణుల్లోంచి రాళ్లు జారిపడుతుండటంతోరాకపోకలను నియంత్రించారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా కుండపోత వర్షం పడింది. రోజంతా రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపించింది.
ఇదీ చదవండి :HEAVY RAINS IN NELLORE: ఇంకా ముంపులోనే ప్రజలు.. మరోవైపు వణికిస్తున్న వరుణుడు