ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా-ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీని మీదుగా రుతుపవన ద్రోణి, అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రమంతా ముసురుపట్టి ఉంది. చాలాచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం అచ్యుతపురత్రయం, కాకినాడ గ్రామీణంలో 18.7 సెం.మీ.చొప్పున, కాకినాడ నగరంలో 16.9 సెం.మీ.వర్షపాతం నమోదైంది. రాజమహేంద్రవరంలోనూ ఆది, సోమవారాల్లో 14 సెం.మీ.కుపైగా వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి.
కాకినాడ ప్రాంతంలో 18 సెం.మీ.కుపైగా వర్షపాతం
- సోమవారం ఉదయం నుంచి కాకినాడ ప్రాంతంలో పది గంటల వ్యవధిలోనే గరిష్ఠంగా 18 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వాగులు ఉగ్రరూపం దాల్చాయి. వేర్వేరు ఘటనల్లో గోడకూలి ఒకరు మరణించగా, వాగు దాటుతూ తెలంగాణకు చెందిన యువతి గల్లంతయ్యారు. మరో 3రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది. జిల్లాల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేశారు.
- పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్లి వస్తూ ఒకరు గల్లంతయ్యారు. తెలంగాణకు చెందిన నలుగురు ద్విచక్రవాహనాలపై దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా కొండవాగు దాటే క్రమంలో కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు సమీపంలోని చెట్టు పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. హనుమకొండకు చెందిన చిత్తూరు మనీషావర్మ(23) గల్లంతయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం యడవల్లిలో వర్షాలకు నానిన మట్టి గోడ కూలడంతో నాగేశు(55) చనిపోయారు. చింతలపూడి-సత్తుపల్లి రహదారిలో చెట్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలు గంటల కొద్దీ నిలిచాయి. మన్యంలో కొండవాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది.
- కాకినాడలో కుండపోతతో ప్రభుత్వ ఆసుపత్రి, కలెక్టరేట్, ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు పలుచోట్ల పల్లపు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. మూడడుగుల ఎత్తులో ప్రవహించింది. పలు దఫాలుగా విద్యుత్తు సరఫరాకు అంతరాయమేర్పడింది. ఏలేరు, వట్టిగెడ్డ తదితర వాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. పోలవరం కాఫర్‌డ్యామ్‌కు వరద పెరిగింది. జిల్లావ్యాప్తంగా సుమారు 4 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది.
- విశాఖపట్నం జిల్లా కల్యాణపులోవ ప్రధాన కాలువకు రావికమతం మండలం జడ్‌కొత్తపట్నం వద్ద గండిపడింది. గొలుగొండ మండలం కరక వద్ద చెరువుకు గండి పడింది. అనకాపల్లిలో మారేడుపూడి, రేబాకలోని కాలనీల్లోకి వరద చేరింది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జీరికి వలస గ్రామంలో గుడిసెలను వరద నీరు ముంచెత్తింది.