Rains: నైరుతి రుతుపవనాల ప్రభావంతో.. దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా - కోస్తాంధ్ర తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. మరోవైపు రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిసింది.
వీటి ప్రభావంతో జమ్మూ కశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టు వివరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇవాళ, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచన ఉండటంతో ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు, వరదల దృష్ట్యా విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని యంత్రాంగానికి సూచించింది. భారీ వర్షాలు, వరదలు సంభవిస్తే.. కంట్రోల్ రూమ్‌కు తెలపాలని కోరింది. అత్యవసర సహాయం, సమాచారం కోసం కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని, ఇందుకోసం 1070, 1800 425 0101, 08632377118 నెంబర్లను సంప్రదించాలని సూచించింది. ఈ కంట్రోల్ రూమ్స్ 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.