నివర్ ధాటికి అతలాకుతలం...స్తంభించిన జనజీవనం నివర్ తుపాను ఏపీలోని నెల్లూరు జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గురు, శుక్రవారాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. వాగుల ఉద్ధృతికి చాలాచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి.
పొలాల్లోకి వరద నీరు...
స్వర్ణముఖి ఉగ్రరూపంతో పంట పొలాలు కోతకు గురయ్యాయి. వ్యవసాయ మోటార్లు, తాగునీటి పథకాల పైపులైన్లు కొట్టుకుపోయాయి. నది పొడవునా కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న పొర్లుకట్ట పనులు పూర్తికాక... పొలాల్లోకి వరదనీరు చేరింది. జిల్లాలో రైతులు భారీగా నష్టపోయారు. 32 మండలాల్లో సుమారు 43 కోట్ల రూపాయల మేర పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
వరద పోటు...
ఎగువ ప్రాంతాల నుంచి పెన్నా నదికి వరద పోటెత్తింది. సోమశిల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 3 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముండటం వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రవాహ ఉద్ధృతికి.. పెన్నానది వరద కట్ట కోసుకుపోయింది. కోవూరు మండలం పోతురెడ్డిపాలెం వద్ద పెన్నా బ్యారేజికి ఎడమవైపున భారీ కోతపడింది.
నిలిచిన రాకపోకలు...
జాతీయ రహదారితో పాటు గ్రామాల మధ్య రహదారుల్లో చాలావరకు జలమయమయ్యాయి. కాలువలు, వాగుల ఉద్ధృతితో రహదారులపై రాకపోకలు నిలిచాయి. గూడూరు-మనుబోలు మధ్య ఆదిశంకర కాలేజీ సమీపంలో.. జాతీయరహదారిపైకి వరదనీరు వచ్చింది. చెన్నై-నెల్లూరు దారిలో ట్రాఫిక్ స్తంభించింది. బాలాయపల్లి మండలం చుట్టిలోని పెద్ద చెరువుకు గురువారం రాత్రి గండిపడింది. చెరువులో నీళ్లన్నీ కైవల్య నదిలోకి వెళ్లాయి. చెరువునీటితో పంటలన్నీ నాశనమయ్యాయి. పొలాల్లో మట్టి మేటలు వేసింది.
ఇవీ చూడండి: నివర్ నష్టంపై ఏపీకేబినెట్ భేటీలో చర్చ.. పరిహారం ఇవ్వాలని నిర్ణయం