Heavy rains in Telangana: రాష్ట్రంలో ఏడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు... జనజీవనం స్తంభించింది. అత్యవసరమై బయటకి వెళ్లేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో నాలుగో రోజు ముసురు కొనసాగుతోంది. చాంద్రాయణగుట్ట పరిధిలో వర్షానికి ఇంటిగోడ నాని కూలి మహిళపై పడింది. ఈ ప్రమాదంలో పర్వీన్ బేగం అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలుచోట్ల వరద నీరు రోడ్లపైకి ప్రవహిస్తుండడంతో... ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. నగరంలోని మురికికాలువలు వరదనీటితో పొంగిపోతున్నాయి. మరోవైపు అల్పపీడనం మరింత బలపడే అవకాశముందన్న వాతావరణశాఖ.... ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
హనుమకొండ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మూడ్రోజులుగా ముసురుతో కూడిన వర్షం పడుతుండటంతో.... నగర ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. బాలసముద్రం ప్రాంతంలో వర్షాలకు చెట్లు కూలిపోయాయి. భూపాలపల్లి జిల్లాలోనూ భారీ వర్షాలకు వాగులు వంకలూ పొంగి ప్రవహిస్తున్నాయి. మల్హర్ మండలం రుద్రారం చెరువు పొంగడంతో... 400 గొర్రెలు కొట్టుకోపోయాయని కాపరి ఆవేదన వ్యక్తం చేశాడు.
మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరిలో క్రమంగా వరద పెరుగుతుండడంతో... ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలోని 25 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భూపాలపల్లి జిల్లా వేములపల్లిలో డ్రైనేజీ నిర్మాణం లేకపోవడం వల్ల పలు ఇళ్లల్లోకి వరద వచ్చి చేరింది. రేగొండ మండలం గోరికొత్తపల్లిలో పెంకుటిల్లు వర్షానికి నాని కూలిపోయింది. మహబూబాబాద్ జిల్లా గుర్తూరు వద్ద ఆకేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. కంటయపాలెం చెరువు మత్తడి పోస్తుండడంతో.... కంటెయాపాలెం , గుర్తూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.