ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
అనంతపురంజిల్లా కదిరిలో రాత్రి కుండపోత వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 26.2సెం.మీ.వర్షపాతం నమోదయింది. వీధులన్నీ చెరువులను తలపించాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. 42వ నెంబర్ జాతీయ రహదారిపై సైదాపురం, నానా దర్గా వద్ద వర్షపు నీటి ఉద్ధృతి తో వాహన రాకపోకలకు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కదిరి పట్టణ సీఐ శ్రీనివాసులు సిబ్బంది హిటాచి, జేసీబీ సహాయంతో ఆక్రమణలను తొలగించారు.
కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు చిత్రావతి నది పరవళ్లు తొక్కుతోంది. పుట్టపర్తి సమీపంలో చిత్రావతి డ్యాం నిండిపోయింది. బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఓడీ చెరువు మండలంలోని మిట్టపల్లి బ్రిడ్జి కింద తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు పూర్తిగా తెగిపోయి, వాహనాల రాకపోకలు నిలిచిపోయి.