ఆకాశానికి చిల్లుపడిందా... కారుమబ్బులన్నీ ధారపోస్తున్నాయా.. అన్నట్లు రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ 9 గంటల వ్యవధిలో నిర్మల్ జిల్లా ముథోల్‌లో రికార్డుస్థాయిలో 20.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో గత పదేళ్ల జులై నెల ఒకరోజు(24 గంటల)లో నమోదైన అత్యధిక వర్షపాతమిదే. ఇంతకుముందు ఒకరోజు అత్యధిక వర్షపాతం 2013 జులై 19న రామగుండంలో 17.7 సెం.మీ.లు అని వాతావరణశాఖ తెలిపింది. అయితే శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకూ ఇదే జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్‌లో 17.8, నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూరులో 20, నవీపేటలో 17.8 సెం.మీ. వర్షపాతం నమోదు కావడం గమనార్హం.
గత రెండు రోజుల్లో ఈ రికార్డు తుడిచిపెట్టుకుపోయి మరింత ఎక్కువ వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 860 ప్రాంతాల్లో వర్షాలు కురవగా అందులో 34 ప్రాంతాల్లో 10 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆది, సోమవారాల్లో సైతం రాష్ట్రంలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు.
జిల్లాల్లో ఉద్ధృతి
- నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సూర్యాపేట, జగిత్యాల, వరంగల్ తదితర జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
- నిర్మల్‌తో పాటు భైంసా పట్టణంలోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో పోలీసులు కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భైంసాలోని రవీంద్రాపూర్‌లోని కాలనీలో వరదనీరు రావడంతో 35 మందిని తెప్పల సహాయంతో అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భైంసా మండలం దేగాం వద్ద పెద్ద వంతెనపై వాగు పొంగి భైంసా-బాసరల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడుచోట్ల పంచాయతీరాజ్ రోడ్లు కోతకు గురయ్యాయి. ఒక ఇల్లు పూర్తిగా.. 11 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్ గ్రామీణ మండలం లింగితండా శివారులోని నెమ్లికుంట అలుగు ఉద్ధృతిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మామిడపల్లికి చెందిన రవి చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు.
పొలాల్లో నీరు నిలవకుండా చూడాలి
మొక్కల దశలో ఉన్న పంటలు వర్షాలకు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నీరు పొలంలో నుంచి బయటికి వెళ్లిపోయేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రైతులకు సూచించింది. పత్తి, సోయా, మొక్కజొన్న వంటి పైర్లలో నీళ్లు నిలబడకుండా చూడాలంది.