మెదక్ జిల్లాలోని వాగులు, చెరువుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. తూప్రాన్, వెల్దుర్తి కొల్చారం పాపన్నపేట మండలాల్లోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. తూప్రాన్ నుంచి కిష్టాపూర్ వెంకటాయపల్లి నర్సంపల్లి కొనయపల్లి తో పాటు సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాలకు వెళ్లే రోడ్డుపై ఉన్న కిస్తాపూర్ హల్దీ వాగు.. పొంగిపొర్లుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరువానలతో ఏజెన్సీలో చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. ఇల్లెందు, టేకులపల్లి గుండాల, ఆళ్లపల్లి, మండలాల్లో వర్షాల కారణంగా వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఇల్లెందులోని ఇల్లందులపాడు చెరువు అలుగు పోస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆళ్లపల్లి మండలంలో పలు గ్రామాలకు వర్షాల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లెందులోని జే కే- 5 , టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.