అప్పటిదాకా ఎండ.. పొడి వాతావరణం.. అప్పటికప్పుడు కారుమబ్బులు.. ఒక్కసారిగా కుండపోత.. కొద్దిగంటల్లోనే 5 నుంచి 10 సెంటీమీటర్ల భారీవర్షం. శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొద్ది సమయంలోనే కుంభవృష్టి కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. వరద రోడ్ల మీదకు పోటెత్తి లక్షల మంది వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఉదయం పూట పగటి ఉష్ణోగ్రత 3 డిగ్రీల దాకా అదనంగా పెరగడంతో ఆ వేడికి ఏర్పడిన పీడనం వల్ల మేఘాలు కిందకు వచ్చి ఒక్కసారిగా కొద్దిగంటల్లోనే కుండపోత వర్షం కురిపించాయని.. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో తరచూ ఇలా జరుగుతోందని రాష్ట్ర వాతావరణ అధికారిణి శ్రావణి చెప్పారు.
రాత్రి 9 గంటల వరకు రద్దీ..:శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైన వర్షం 3.30 వరకు అన్ని చోట్లా విస్తరించింది. సాయంత్రం 5 గంటల వరకు దంచికొట్టింది. దాంతో రోడ్ల మీదకు వరద పోటెత్తి రాత్రి 9 గంటల దాకా గ్రేటర్ పరిధిలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు సహా అనుసంధాన రోడ్లలోనూ వాహనాల రాకపోకలు స్తంభించాయి. వర్షం తగ్గాక పాఠశాలల నుంచి బయటకు వచ్చిన వేల మంది విద్యార్థులు, కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు చింతలకుంటకు వెళ్లిన హోంమంత్రి మహమూద్ అలీ కాన్వాయ్ వరద ప్రవాహం కారణంగా ఆగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు అతి కష్టమ్మీద కాన్వాయ్‌ని బయటకు పంపించారు. మరోవైపు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రోగులను తీసుకొచ్చే అంబులెన్సులూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి.