Rains In Hyderabad: భాగ్యనగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాజులరామారం, ఎల్బీనగర్లోని పలు కాలనీలను వరద చుట్టుముట్టింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ఉదయం పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వానొచ్చింది.. వరద తెచ్చింది.. కాలనీలను ముంచింది - వరదతో కాలనీలు జలమయం
Rains In Hyderabad: భాగ్యనగరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచింది. గాజులరామారం, ఎల్బీనగర్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.
గాజులరామారంలోని ఓక్షిత్ ఎన్‌క్లేవ్‌ను మరో సారి వరదనీరు ముంచెత్తింది. ఎగువన ఉన్న పెద్దచెరువు నిండిపోయి.. దిగువకు నీరు చేరుతుండటంతో కాలనీ జలమయమైంది. మోకాళ్ల లోతు నీరు చేరుతుండటంతో కాలనీలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రోడ్లపై నిలిచిన వరద నీటితో వాహనదారులు అవస్థలకు గురవుతున్నారు. ముంపు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు పర్యటిస్తున్నారు. బల్దియా సిబ్బంది ఆయా ప్రాంతాల్లో వరద నీరు పోయేలా చర్యలు చేపడుతున్నారు.
ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాలకు నగరంలో చెరువులన్నీ నిండుకుండలా మారాయి. అర్ధరాత్రి వేళ మరోసారి భారీగా కురిసిన వానకు చెరువుల్లోకి ప్రవాహం పెరిగింది. దీంతో నగరంలోని చెరువుల పక్కన ఉన్న లోతట్టు ప్రాంతాల కాలనీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి.