Heavy rain: రాత్రి కురిసిన భారీ వర్షంతో ఏపీలోని అనంతపురం నగరంలోని కాలనీలను వరద ముంచెత్తింది. చాలా కాలనీల్లోకి వరద నీరు పెద్ద ఎత్తున ప్రవేశించటంతో జనావాసాలన్నీ జలదిగ్భంధంలో ఉన్నాయి. మంగళవారం రాత్రి రెండు గంటల సమయం నుంచే భారీ వర్షంతో ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తింది. యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి వరద అనంతపురం నగరాన్ని ముంచెత్తింది. ఆలమూరు చెరువు నుంచి నడిమివంకకు ఎన్నడూ లేనంతగా భారీ ప్రవాహం వచ్చింది. దీనికి తోటు నడిమివంక పూర్తిగా ఆక్రమణలకు గురికావటంతో ప్రవాహం వెళ్లటానికి దారిలేక కాలనీలను ముంచెత్తింది.
వరద భయంతో మిద్దెలపైకి వెళ్లిన ప్రజలు: నగరంలోని 5, 6 రోడ్డు, సోమనాథనగర్, రంగస్వామి నగర్‌లో జనావాసాలు పూర్తిగా జలదిగ్భంధంలో ఉన్నాయి. అనంతపురం గ్రామీణ మండలంలోని గౌరవ గార్డన్స్, రుద్రంపేట పంచాయతీ, యువజన కాలనీ తదితర కాలనీలన్నీ పూర్తిస్థాయిలో జలదిగ్భంధంలో ఉన్నాయి. ఇళ్లలోకి వరద ప్రవేశించటంతో అర్దరాత్రి దాటాక ప్రజలు మిద్దెలపైకి వెళ్లి భయంగా గడిపారు. ఇప్పటికీ అనేక కాలనీల్లో మూడు అడుగుల మేర వరద ప్రవహిస్తూనే ఉంది. అనంతపురం జలదిగ్బంధమైంది. భారీ వర్షానికి మంగళవారం రాత్రి 2గంటల సమయంలో యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి అనంతపురం నగరంలోకి వరద పోటెత్తింది. నడిమివంక ఒక్కసారిగా ఉరకలెత్తింది. నడిమివంక ఆక్రమణలకు గురవడంతో ఆ నీరంతా వెళ్లేదారిలేక సమీప కాలనీలను ముంచెత్తింది.
నిలిచిపోయిన విద్యుత్ సరఫరా: నడిమివంక ఉద్ధృతికి యువజన కాలనీ, రజకనగర్, రంగస్వామినగర్ సహా అనేక శివారు కాలనీలు జలమయం అయ్యాయి. కనుచూపు మేరలో నీళ్లే కనిపిస్తున్నాయి. చాలాచోట్ల 3 అడుగు మేర వరద ప్రవహిస్తోంది. ఇళ్లు, రోడ్లు, డ్రైన్లు అన్నీ ఏకమయ్యాయి. ఎటువీలుంటే అటే వరద నీరు ముంచెత్తుతోంది. చంద్రబాబు నగర్‌లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. కక్కలపల్లి కాలనీలోని ఆదర్శనగర్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. పలు ముంపు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇళ్లను వరద ముంచెత్తడంతో స్థానికులు అర్ధరాత్రి మిద్దెలపైకి వెళ్లారు. కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూగడిపారు ఇంట్లో పొయ్యి వెలిగించలేని పరిస్థితుల్లో ముంపు బాధితులు ఆహారం కోసంఎదురుచూస్తున్నారు.
స్తంభించిన జనజీవనం:బాధితులను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరానికి తరలించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కర్నూలు నుంచి విపత్తు నిర్వహణా బృందాలను, శింగనమల నుంచి పడవలను అధికారులు రప్పిస్తున్నారు. అంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్ల అనంతపురం సమీపంలో కాజ్వే కూలిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాళ్ల అనంతపురం- ఐపార్సపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు వడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. వరద పోటుకు అనంతపురంలోని రుద్రంపేట కూడా జలమయమైంది.