బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం తీవ్రత ఎక్కువై... ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలైన ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడతోపాటు ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, సిర్పూర్, లింగాపూర్‌లో కురిసిన వర్షానికి వాగులు చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి.
ఎడతెరపి లేకుండా వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు - ఆదిలాబాద్‌లో ఏకధాటిగా వర్షాలు
ఆదిలాబాద్‌లో జిల్లాలో చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులవైపు వెళ్లొద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలోని జైనూర్, గాదిగూడ, నార్నూర్, ఉట్నూర్, పుట్లూరు మండలాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున... ఆయా ప్రాంతాల ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విషయాన్ని గమనించిన ఎస్సైలు సిబ్బందితో వాగుల వద్దకు చేరుకొని... తాళ్ల సహాయంతో ప్రజలను వాగు దాటించారు.
ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని చెరువులు నిండుకుండల్లా మారాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున... అటు వైపు వెళ్లొద్దని ఎస్సైలు సుబ్బారావు, విజయ్ స్థానికులకు సూచించారు.