తెలంగాణ

telangana

ETV Bharat / city

తడిసిన ధాన్యం రాశులు... తల్లడిల్లిన అన్నదాతలు - ఉత్తరాంధ్రలో వర్షం

ఏపీలోని పలు జిల్లాల్లో శనివారం కురిసిన అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో పాటు పిడుగుల మోత వినిపించింది. విశాఖ జిల్లా గంగవరంలో 126.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే స్థాయిలో వర్షం కురిసింది. కోతకొచ్చిన వరితో పాటు రాశులుగా పోసిన ధాన్యం తడిసిపోయింది. మామిడి రాలి పడటంతో పాటు తీగజాతి పంటలు, నువ్వులకు నష్టం వాటిల్లింది. పిడుగులు పడి ఓ బాలికతో పాటు వివిధ ప్రాంతాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

rain effect in andhra
తడిసిన ధాన్యం రాశులు... తల్లడిల్లిన అన్నదాతలు

By

Published : Apr 26, 2020, 6:56 AM IST

ఉత్తరాంధ్రలో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. విశాఖ జిల్లాలో గంటన్నరపాటు కురిసిన వర్షంతో పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరింది. గాలుల ధాటికి చెట్లు, స్తంభాలు నేలకూలాయి. విశాఖ నరవ ప్రాంతంలో పిడుగుపాటుతో ఆటోడ్రైవర్‌ పైల కోటేశ్వరరావు(36) చనిపోయారు. పశువుల్ని తోలుకెళ్లిన ఆయన పిడుగుపాటుకు గురయ్యారు. పెదగంట్యాడ పరిసరాల్లో 8 కాలనీల్లోకి ముంపునీరు చేరింది. మధ్యాహ్నం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచింది.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, గొల్లప్రోలు, తుని, ప్రత్తిపాడు, సామర్లకోట, పెద్దాపురం, కోటనందూరు తదితర మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. తొండంగి మండలంలోని దానవాయిపేటలో చిన్నారి మడదా శ్రీమాధురి(3) ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా పిడుగు పడి తీవ్ర గాయాలపాలైంది. చికిత్స పొందుతూ కాకినాడ జీజీహెచ్‌లో కన్నుమూసింది.

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం వలిసెలమడ గ్రామంలో పిడుగు పడి యువతి పోలమ్మ(18) చనిపోయింది. విజయనగరంలో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. మొక్కజొన్న కంకులు తడిచిపోయాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతంలోని మాసాపేట వద్ద వందేళ్లనాటి వృక్షం కూలింది. చిత్తూరు జిల్లాలో మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. తిరుపతిలోని తాత్కాలిక మార్కెట్ల పందిళ్లు కుప్పకూలాయి. తిరుమలలో రెండున్నర గంటలకుపైగా వర్షం కురిసింది.

భారీవర్షాలు కురిసే అవకాశం

వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ పరిసరాల నుంచి దక్షిణ తమిళనాడు వరకు తూర్పు మధ్యప్రదేశ్‌, విదర్భ, కర్ణాటక మీదుగా 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.

వర్షంతో పాటు ముదిరిన ఎండలు

ఒక వైపు భారీవర్షంతో పాటు మరో వైపు ముదిరిన ఎండలు ప్రజల్ని ఠారెత్తించాయి. గరిష్ఠంగా ప్రకాశం జిల్లా పొదిలిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉంది. కడప, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లోని ఎనిమిది మండలాల్లో వడగాల్పులు వీచాయి. 409 మండలాల్లో ఉష్ణతాపం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలో 64, కృష్ణా జిల్లాలో 49, పశ్చిమగోదావరి 48, గుంటూరు 48, ప్రకాశం 38, నెల్లూరు 37, విశాఖపట్నం 31, శ్రీకాకుళం 26, విజయనగరం 25, చిత్తూరు 24, కడప 12, కర్నూలు 5, అనంతపురం 2 మండలాల్లో ఉక్కపోత పరిస్థితులున్నాయి.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

ABOUT THE AUTHOR

...view details