మాఘమాసం బుధవారం నుంచి ఆరంభమవుతోంది. శూన్యమాసం తరువాత ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలకు సిద్ధం అవుతున్నారు. మరోపక్క మూడో దశ కరోనా ముప్పు ఉండటంతో నిబంధనలు తప్పక పాటించాల్సిన పరిస్థితి. తూర్పులో వివాహాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆహ్వానితుల సంఖ్య, భోజనాల ఏర్పాటు, వేదికలు, కల్యాణ మండపాల్లో కిక్కిరిసే పరిస్థితులపై అధికార యంత్రాంగం హెచ్చరికల మాటెలా ఉన్నా.. నిర్వాహకులు చైతన్యంతో, బాధ్యతగా భావించి తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
20 రోజులు..
ఫిబ్రవరి 2, 3, 5, 6, 7, 10, 11, 14, 17, 19 తేదీల్లో మంచి ముహుర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది తమ ఇళ్లలో శుభకార్యాలకు నిర్ణయించారు. ఈ ముహూర్తాలు దాటితే మళ్లీ ఏప్రిల్‌లోనే మంచి రోజులుంటాయని పురోహితులు అంటుండటంతో త్వరపడుతున్నారు.