తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ప్రాజెక్టులకు జలసవ్వడి - నీటిప్రాజెక్టులకు భారీ వరద

Huge Inflow to Irrigation Projects : గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఓవైపు వరద ఉద్ధృతి.. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో వచ్చే ప్రవాహంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న వానతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి.

Huge Inflow to Irrigation Projects
Huge Inflow to Irrigation Projects

By

Published : Jul 12, 2022, 9:38 AM IST

Huge Inflow to Irrigation Projects : ఎగువ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. గోదావరితో పాటు ఉపనదులు ఉరకలెత్తుతున్నాయి. ప్రాజెక్టులకు జలకళను సంతరించుకోగా.. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. భారీ ప్రవాహంతో జలాశయాలు నిండుకుండలా మారటంతో.. గేట్లను ఎత్తి, నీటిని దిగువకు వదులుతున్నారు.

Huge Inflow to Telangana Irrigation Projects : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం వేగంగా పెరిగి ప్రస్తుతం నిలకడగా ప్రవహిస్తోంది. నీటిమట్టం 53అడుగులు దాటి ఉండడంతో.. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రాత్రి వరకు 53.9 అడుగుల వరకు పెరిగిన నీటిమట్టం.. ఉదయానికి ఐదు పాయింట్లు తగ్గింది. నిన్న పెరిగిన గోదావరి నీటిమట్టం వల్ల భద్రాద్రి రామయ్య సన్నిధి వద్ద అన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరాయి.

భద్రాచలంలోని లోతట్టు కాలనీలు మునిగిపోయాయి. అక్కడున్న వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. స్నాన గట్టాలు, కళ్యాణ కట్ట ప్రాంతం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. భద్రాచలం నుంచి చర్ల, దుమ్ముగూడెం మండలాలతోపాటు.. దిగువన ఉన్న ముంపు మండలాల రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని సుమారు 100 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 62వేల 840 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 20 గేట్ల ద్వారా 69వేల 450 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 14వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం వెయ్యి 87 అడుగుల నీటిమట్టం, 75 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

నిర్మల్‌ జిల్లా కడెం జలాశయంలోకి భారీగా వరద ప్రవహిస్తోంది. ప్రాజెక్టులకి లక్షా 40 వేల క్యూసెక్కుల వరద చేరుతుండడంతో.. 11 గేట్ల ద్వారా లక్షా 29వేలు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులుకాగా.. ప్రస్తుతం 692 అడుగులకు చేరింది. సారంగాపూర్ మందలంలోని స్వర్ణ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 4వేల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 11వందల 83 అడుగులు కాగా ప్రస్తుతంస నీటిమట్టం 11వందల 79 అడుగులు చేరింది.

హైదరాబాద్‌ జంట జలాశయాల్లోకి వరద కొనసాగుతోంది. ఉస్మాన్‌సాగర్‌కు 250 క్యూసెక్కుల వరద వస్తుండగా.. రెండు గేట్ల ద్వారా 312 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులుకాగా.. ప్రస్తుత నీటి మట్టం 17వందల 86 అడుగులు ఉంది.

హిమాయత్‌సాగర్‌కు 500 క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా.. రెండు గేట్ల ద్వారా 515 క్యూసెక్కులు మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులుకాగా.. ప్రస్తుత నీటిమట్టం 1760.55 అడుగులు ఉంది. హుస్సేన్‌సాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. హుస్సేన్‌సాగర్‌కు 513.41 మీటర్లు వస్తున్న నీటికి సమానంగా తూముల ద్వారా బయటకి వెళ్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details