వేసవి ఎండల తీవ్రత రాత్రి సమయంలోనూ పెరుగుతోంది. గురువారం రాత్రి రాష్ట్రంలోకెల్లా అత్యధిక ఉష్ణోగ్రత హైదరాబాద్‌లో నమోదైంది. నగరంలోని మణికొండలో 27.6, డబీర్‌పురాలో 27.5, సంతోష్‌నగర్‌లో 27.3, యూసుఫ్‌గూడలో 27.1, బన్సీలాల్‌పేటలో 27 డిగ్రీలుంది. వికారాబాద్ జిల్లా నాగారం గ్రామంలో అత్యల్ప ఉష్ణోగ్రత 18.8 డిగ్రీలుంటే.. అంతకన్నా 9 డిగ్రీలు ఎక్కువగా నగరంలో నమోదు కావడం గమనార్హం.
పొద్దునేమో భానుడి భగభగ... రాత్రిపూట ఉక్కపోత - summer nights
వేసవి ప్రభావం రాష్ట్రంపై భారీగా పడుతోంది. ఉదయం భానుడు భగభగలాడుతూ జనాన్ని ఉక్కిరిబిక్కిరిచేస్తుంటే... ఆ వేడి రాత్రిపూట కూడా జనాన్ని ఉడకబెట్టేస్తోంది. ఈ ఉక్కపోత ప్రభావం హైదరాబాద్‌లో ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
పరిశ్రమలు, వాహనాల కాలుష్యం, కాంక్రీట్ జంగిల్‌లా పెరిగిపోతున్న భవనాల వల్ల వేడి తీవ్రత అధికంగా ఉంటోందని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న వివరించారు. హైదరాబాద్‌లో రాత్రిపూట సాధారణంగా 22.5 డిగ్రీలకు మించకూడదు. కానీ వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల వేడి అధికంగా ఉంటోందని ఆమె చెప్పారు. ఉత్తరాది నుంచి పొడిగాలులు వీస్తున్నందున మరో 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని వివరించారు. శుక్రవారం మధ్యాహ్నం అత్యధికంగా రెబ్బెన(కుమురం భీం జిల్లా)లో 40.3, జైపూర్(మంచిర్యాల జిల్లా)లో 40.2, మద్దుట్ల(జగిత్యాల)లో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.