తెలంగాణ

telangana

ETV Bharat / city

కర్ణాటకలో వరద.. అనంతపురంలో విలయం.. ఇదీ వేదవతి నది పరిస్థితి.. - వేదవతి నదికి వరద

Floods to Vedavati River: గత నలభై సంవత్సరాలుగా ఒక్క నీటి బొట్టు లేని వేదవతి నదిని వరదలు అతలాకుతలం చేశాయి. ఉహించని స్థాయిలో వచ్చిన వరదల వల్ల అనంతపురం జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని పదుల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యవసర పనులను ముగించుకుంటున్నారు.

vedavathi river
వేదవతి నది

By

Published : Sep 25, 2022, 4:03 PM IST

Heavy Floods To Vedavati River: కర్ణాటక నుంచి ప్రవహించే వేదవతి నది ఇటీవల వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరదతో ముంచెత్తింది. 40 ఏళ్లకుపైగా చుక్క నీటిని చూడని ఈ నదిలో.. రెండేళ్లుగా కొద్దిపాటి ప్రవాహాలతో అక్కడక్కడా మడుగులు కనిపించేవి. ఈసారి రికార్డు స్థాయిలో లక్ష క్యూసెక్కుల వరద రావడంతో.. బీటీ ప్రాజెక్టు గేట్లన్నీ తెరిచారు. భారీ ప్రవాహం వల్ల ఈ నదిపై మండల కేంద్రాలు, గ్రామాలను అనుసంధానం చేసే వంతెనలన్నీ గల్లంతయ్యాయి. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వేదవతి నది సృష్టించిన బీభత్సంపై కథనం.

అనంతపురం అతలాకుతలం.. దేశంలోనే తీవ్ర కరవు జిల్లాగా గుర్తింపు పొందిన ఏపీలోని అనంతపురం జిల్లాలో ఈసారి నదులు సామర్థ్యానికి మించి ప్రవహించాయి. కర్ణాటక రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో.. దిగువనున్న ఏపీలోకి వరదను విడుదల చేశారు. దీంతో సరిహద్దులోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేదవతి, చిత్రావతి, పెన్నా నదులన్నీ ఉద్ధృతంగా ప్రవహించాయి. అనంతపురం జిల్లాలో మృతనదిగా రికార్డుల్లోకి ఎక్కిన వేదవతి నది.. వందేళ్ల చరిత్రను తిరగరాసే ప్రవాహాన్ని తీసుకొచ్చింది. 40 ఏళ్లుగా ప్రవాహాలు లేని.. గుమ్మగట్ట మండలంలోని బీటీ ప్రాజెక్టుకు వేదవతి నది లక్ష క్యూసెక్కుల నీటిని మోసుకొచ్చింది.

రెండు టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నుంచి వారం రోజులకుపైగా.. 70 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. ఈ ప్రవాహం.. అనేక వంతెనలను ఆనవాళ్లు లేకుండా చేసింది. నదిలో వేసిన తాగునీటి పథకాల బోర్లు.. ఇసుకతో నిండిపోయాయి. నది పొడవునా వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నది ప్రవహం అధికంగా ఉండటం వల్ల బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి బొమ్మనహాల్‌ మండలంలోని 9 గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేక ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు.

బొమ్మనహాల్‌, కనేకల్ మండలాల్లో.. వేదవతి నది.. రైతులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం చేకూర్చింది. కల్లుదేవరపల్లి వద్ద వేదవతి నదిపై ఉన్న వంతెన కొట్టుకుపోవడంతో.. బొమ్మనహాల్ నుంచి ఉరవకొండ, గుంతకల్లు, విడపనకల్లు, అనంతపురానికి రాకపోకలు నిలిచాయి. 70 కిలోమీటర్లకు పైగా అదనంగా ప్రయాణించి.. కర్ణాటకలోని బళ్లారి జిల్లా గుండా.. ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నారు. కనేకల్ మండలంలోని మాల్యం వద్ద రహదారి కల్వర్టులు దాదాపు కిలోమీటర్ మేర కొట్టుకుపోయాయి. దీంతో.. కనేకల్‌ నుంచి రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు వెళ్లడానికి ప్రజలు అదనంగా 18 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ మార్గంలో వేదవతి నదిపై నిర్మించిన వంతెన కూడా శిథిలావస్థకు చేరడంతో.. రాకపోకలు నిలిపేశారు. వేదవతి నదీ పరివాహ ప్రాంతంలో సాగుచేసిన పంటలన్నింటినీ వరద తుడిచిపెట్టుకపోవడంతో.. రైతులు తీవ్రంగా నష్టపోయారు.

వేదవతి నది మిగిల్చిన కష్టాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details