godavari river bank: ఆంధ్రప్రదేశ్ ఉభయగోదావరి జిల్లాల్లో గోదావరి కరకట్టలు చాలాచోట్ల భయపెడుతున్నాయి. వీటి పటిష్ఠానికి నిధులిచ్చి గట్టు పటిష్ఠం చేయాల్సి ఉన్నా.. మూడేళ్లుగా సరైన చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం చాలా ఏళ్ల తర్వాత జులైలోనే గోదావరికి భారీ వరద వస్తోంది. గురు, శుక్రవారాల్లో కాటన్ బ్యారేజికి 21 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని అంచనా. గతంలో భద్రాచలం వద్ద వరద హెచ్చరికలు, ఎగువ నుంచి వచ్చే ప్రవాహాల ఆధారంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఎప్పటికి ఎంతస్థాయి వరద రానుందో అంచనా వేసి నియంత్రించటం సులభమయ్యేది.
ప్రస్తుతం పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యాం 42 మీటర్ల ఎత్తులో నిర్మించారు. స్పిల్ వే నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు కిందకు వదిలేసినా అక్కడ క్రెస్ట్ స్థాయి 28.52 మీటర్ల స్థాయిలో ఉంది. పోలవరం వద్ద గోదావరిలో 29 మీటర్ల ఎత్తులో అడ్డుకట్ట పడినట్లే లెక్క. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం ధవళేశ్వరం వద్ద అంచనాకు అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పోలవరం వద్ద కొంతమేర వరదకు అడ్డుకట్ట పడుతోంది.
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో మరో రెండు, మూడు రోజుల పాటు గోదావరి వరద ప్రవాహాలు ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. పోలవరం స్పిల్ వే నిర్మాణం తర్వాత 2020 ఆగస్టులో అత్యధికంగా 22,85,000 క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రస్తుతం జులైలో దాదాపు అదే స్థాయి లేదా, అంతకుమించి వరద రావచ్చని అంచనా. రాజమహేంద్రవరం తర్వాత అఖండ గోదావరి ఏడు పాయలుగా చీలిపోయింది.