తెలంగాణ

telangana

ETV Bharat / city

Rain : ఏకధాటి వానలు.. ఉప్పొంగుతున్న వాగులు.. ఆందోళనలో ప్రజలు - heavy floods in telangana

ఏకధాటి వర్షాలు.. జలమయమైన రహదారులు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వాగులు.. అలుగుపారుతున్న చెరువులు.. నిండుకుండలా మారిన ప్రాజెక్టులు.. తెలంగాణలో ఎటు చూసినా నీళ్లే కనబడుతున్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న వానలు.. రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. వరణుడి ప్రతాపం జనజీవనం అస్తవ్యస్తమం చేస్తోంది.

ఏకధాటి వానలు.. ఉప్పొంగుతున్న వాగులు
ఏకధాటి వానలు.. ఉప్పొంగుతున్న వాగులు

By

Published : Jul 23, 2021, 12:27 PM IST

ఎడతెరిపి లేని వర్షాలు రాష్ట్రాన్ని జలదిగ్బంధం చేశాయి. మూడ్రోజులుగా కురుస్తున్న వానలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. చెరువులను తలపిస్తోన్న రహదారులు.. ఉప్పొంగుతున్న వాగులు.. ఉగ్రరూపం దాల్చిన నదులు.. నిండుకుండలా జలాశయాలు.. నీటమునిగిన పంటలు.. స్తంభించిన రాకపోకలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. బయటి ప్రపంచంతో సంబంధాలు తెంపేసిన వాన.. ప్రజలను అంధకారంలోకి నెట్టేస్తోంది. ఏకధాటి వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలను ముంచెత్తాయి.

అంధకారంలో గ్రామాలు..

కుమురంభీం జిల్లా వాంకిడి మండలానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి... గ్రామాలు అంధకారమయ్యాయి. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆగిపోయాయి. కోమటిగూడలో వరదలో చిక్కుకున్న 40మంది కూలీలను అర్ధరాత్రి వేళ అధికారులు రక్షించారు. ఎల్కపల్లి వద్ద పెద్దవాగు ఉగ్రరూపం దాల్చటంతో... నూతనంగా నిర్మిస్తున్న వంతెన వద్ద 9 మంది కార్మికులు వరదనీటిలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కాగజ్‌నగర్‌లోని సర్ సిల్క్ కాలనీ, ఎస్​పీఎం కాలనీలు జలమయమయ్యాయి. అందెల్లిలో శ్మశానవాటిక నీటమునిగింది. కొత్త సార్సాల- పాత సార్సాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సిర్పూర్-టి మండలంలో విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. దహేగం మండలంలో ఎర్రవాగు, బెజ్జూరు మండలంలో తీగల ఒర్రె, కృష్ణపల్లిలో సోమిని ఒర్రెలు ఉప్పొంగుతుండటంతో... చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వరద బీభత్సం..

మంచిర్యాలలోని రాంనగర్, ఎన్టీఆర్ నగర్, ఎల్​ఐసీ కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరటంతో ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. జైపూర్, చెన్నూర్ మండలాల్లో వరద బీభత్సం సృష్టించింది. చెన్నూరు మండలం సుందరశాల, నాగపూర్, నర్శక్కపేట, పొక్కూర్, చింతలపల్లి గ్రామాల్లో పంటలు వర్షార్పణమయ్యాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి పెదవాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నిన్న వంతెన దాటుతూ కాపలాదారుడు చంద్రయ్య వాగులో పడిపోయాడు. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు... ఉదయం మృతదేహాన్ని గుర్తించారు.

వరదలో చిక్కిన కార్మికులు..

పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరిఖని మల్కాపూర్ వద్ద ఇటుక బట్టీలో పనిచేసే 40 మంది కార్మికులు వరదలో చిక్కుకున్నారు. తాళ్ల సాయంతో బాదితులను బయటకు తీసుకువచ్చారు. మేడిపల్లి ఓసీపీ ప్రాజెక్ట్​కు వెళ్లే దారిపై వరదనీరు చేరి... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంథని మండలంలో చాలా గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. ఎగ్లాస్పూర్ గ్రామం చుట్టూ ప్రమాదకర స్థితిలో నీరు చేరింది. ఉప్పట్ల, పోతారం, ఎక్లాస్ పూర్, ఖానాపూర్, ఆరెంద గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గోదావరి ఒడ్డున ఉన్న గౌతమేశ్వర స్వామి దేవాలయం చుట్టూ నీరు చేరింది.ఆలయంలో ఉన్న 28 మంది వరదలో చిక్కుకున్నారు.

ఉప్పొంగిన వాగులు..

నిర్మల్ జిల్లాలో స్వర్ణవాగు ఉప్పొంగి.... పట్టణంలోని జీఎన్​ఆర్ కాలనీ జలదిగ్బంధమైంది. క్షణాల్లో కాలనీ జలమయమవటంతో.... ప్రజలంతా ఇళ్లపైకి ఎక్కారు. రంగంలోకి దిగిన అధికారులు... బాధితులను కాపాడారు. కాగా... కాలనీలోని డెయిరీ ఫారాల్లో పశువులు వరదకు కొట్టుకుపోయాయి. భైంసా మండలం పల్సికర్ రంగారావు జలాశయం వెనుక జలాలు గ్రామాల్లోకి చేరాయి. గుండేగాం గ్రామం జలదిగ్బంధమైంది. రాత్రంతా స్థానిక పాఠశాలలో ఆవాసం పొందిన గ్రామస్థులను... అధికారులు ఉదయం సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

రాకపోకలకు అంతరాయం..

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పేటసంగెం వద్ద రహదారి తెగిపోయి... పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో చాలా చోట్ల పంటలు నీటమునగగా... పలు ఇళ్లు కూలిపోయాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తురు గ్రామంలో ఆకేరు వాగు పొంగి పొర్లుతోంది. దీంతో తొర్రూరు నుంచి నర్సంపేట పోయే వాహన రాకపోకలు నిలిచిపోయాయి. తొర్రూరు మండలం మడిపల్లి- గుర్తురు గ్రామాల మధ్య కూడా రవాణాకు అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాలు..

అల్పపీడనం ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం... అప్రమత్తమైంది. వరద ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతోంది. ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు రంగంలోకి దిగి... లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details