భారీవర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ నగరవాసులకు అండగా నిలిచేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళాలు అందించి దాతృత్వం చాటుకున్నారు.
రామోజీ గ్రూప్ తరఫున సంస్థ ఛైర్మన్ రామోజీరావు రూ.5 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు నరసింహారెడ్డి, మల్లేశం... పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్‌ను అందించారు. రామోజీరావుకు ఫోన్ చేసిన కేటీఆర్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
కిమ్స్, యశోద ఆసుపత్రులు చెరో కోటి రూపాయలను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ఇచ్చాయి. వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరపున సంస్థ వ్యవస్థాపకులు, ఛాన్స్లర్ విశ్వనాథ్.. కోటి రూపాయలు అందించారు. మెడికవర్ ఆసుపత్రి తరఫున రూ.50లక్షలు అందించారు.
హీరో పోతినేని రామ్ రూ.25 లక్షలు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ రూ.10 లక్షలను సీఎంఆర్ఎఫ్కు ఇచ్చారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా తన సంస్థ శ్రీనివాస్ ఆగ్రో ప్రొడక్ట్స్ తరఫున పది లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు.
కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.