సన్న రకం వరి ధాన్యం పండించడానికే అధిక శాతం రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా చాలా రాష్ట్రాల వ్యవసాయశాఖలు... తెలంగాణలో పండే సన్న రకం వరి విత్తనాల కోసం ప్రతిపాదనలు పంపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5లక్షల 42వేల క్వింటాళ్ల ధాన్యాన్ని... రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తి చేస్తోంది. క్షేత్రస్థాయిలో రైతులకు ఈ విత్తనాలను వ్యవసాయశాఖ రాయితీపై విక్రయిస్తోంది.
వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం క్వింటాల్ వరి విత్తనం మూడు ఎకరాల విస్తీర్ణానికి సరిపోతుంది. ఈ లెక్కన ప్రభుత్వ సంస్థలు అమ్మే విత్తనాలే 16 లక్షల 50 వేల ఎకరాలకు సరిపోతాయి. ప్రైవేటు విత్తన కంపెనీలు కూడా సన్న రకాలనే అత్యధికంగా విక్రయిస్తున్నందున విస్తీర్ణం ఇంకా పెరగనుంది. ఈ ఏడాది రైతులతో ప్రభుత్వం 10 రకాల విత్తన పంటలు సాగు చేయించింది. వీటిలో ప్రధానంగా 4 రకాల పంటలే 50 శాతానికి పైగా ఉండటం గమనార్హం.
కొత్త వంగడాలకు ప్రోత్సహం
కాటన్ దొర సన్నాలు, ఎంటీయూ 1010 వరి రకం తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 49 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు అంచనా. ఇందులో దాదాపు మూడో వంతు సాగు చేస్తున్న కాటన్ దొర సన్నాలను 2 లక్షల 4 వేల క్వింటాళ్ల విత్తనాలు పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకే రకం వంగడాన్ని ఏళ్ల తరబడి ఒకే పొలంలో సాగు చేస్తే దిగుబడి పెరగదని... కొత్త వండగాలు ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది.