రాష్ట్రంలో రేపట్నుంచి ఈనెల 21 వరకు లాక్‌డౌన్ అమలు కానున్న నేపథ్యంలో ప్రజలు స్వగ్రామాలకు పయనమవుతున్నారు. హైదరాబాద్లో ఉపాధి పనులు చేసుకుంటున్న చాలా మంది కూలీలు, ఉద్యోగులు స్వస్థలాలకు వెళ్తున్నారు. బస్టాండులు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ టికెట్ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇవ్వడం వల్ల మిగితా ప్రయాణికులు రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో వేచి చేస్తున్నారు.
ఇక బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు మాత్రం ఒకే బస్సులో రెండు బస్సులకు సరిపడా ఎక్కి వెళుతున్నారు. బస్సుల్లో ప్రయాణించే వారు ఎక్కడా కూడా భౌతికదూరం పాటించడంలేదు. కొంతమంది మాస్కులు సైతం పెట్టుకోకుండానే ప్రయాణం సాగిస్తున్నారు. ఏ బస్సు వచ్చినా.. పరుగెత్తుకుని వెళుతున్నారు. ఒక్కసారిగా ప్రయాణికులు ఎక్కువ అవటం... బస్సులు తక్కువగా ఉండడం వల్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. మరిన్ని బస్సులను సమకూర్చాలని ఆర్టీసీ యాజమాన్యానికి ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.