తెలంగాణ

telangana

ETV Bharat / city

TPCC PAC Meeting : వాడీవేడిగా పీఏసీ మీటింగ్​.. రేవంత్​ తీరుపై సీనియర్ల అసహనం.. - jaggareddy in pac meeting

TPCC PAC Meeting : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం వాడీవేడిగా సాగింది. నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై పలువురు సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను కోవర్టుగా చిత్రీకరిస్తున్నందున రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించటంతో.. ఎమ్మెల్యే శ్రీధరబాబు, మాజీ మంత్రి జానారెడ్డిలు జోక్యం చేసుకుని శాంతింపజేశారు.

Heated discussion in TPCC PAC Meeting about revant behavior
Heated discussion in TPCC PAC Meeting about revant behavior

By

Published : Jan 6, 2022, 5:13 AM IST

TPCC PAC Meeting : టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నాలుగు గంటల పాటు వాడీవేడిగా సాగింది. జూమ్ యాప్ ద్వారా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగ్గా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. మొదటగా... రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై, సభ్యత్వ నమోదు ప్రక్రియను పీఏసీ సభ్యులకు పీసీసీ వివరించారు. అనంతరం ఒక్కో సభ్యుడు మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఒంటెద్దు పోకడతో పోతున్నారని.. సీనియర్లను కలుపుకుని వెళ్లడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు పార్టీ నాయకులకు అందుబాటులో లేని కారణంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి వైఖరిని పలువురు తప్పు పట్టారు. మెజారిటీ సభ్యులు పీసీసీ అధ్యక్షుడి పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో జోక్యం చేసుకున్న మానిక్కం ఠాగూర్….రేవంత్ రెడ్డిని సుతిమెత్తంగా మందలించారు. పార్టీ క్యాడర్ అందరికి అందుబాటులో ఉండాలని రేవంత్ రెడ్డికి సూచించారు.

రాజీనామా చేస్తానన్న జగ్గారెడ్డి..

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీఏసీ సమావేశంలో తీవ్రంగా స్పందించారు. పార్టీకి నిబద్ధతతో పని చేస్తున్న తనను కోవర్టుగా చిత్రీకరించారని... తాను పార్టీలో ఉండదలచుకోలేదని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. తనకు విలువ ఇవ్వడం లేదని.. అవమానాల పాలవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జోక్యం చేసుకున్న సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే శ్రీధరబాబు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని.. కూర్చొని మాట్లాడదామని సూచించారు. క్రమశిక్షణ కమిటీ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన రీతిలో పని చేయడం లేదని, అనవసర విషయాలల్లో తలదురుస్తున్నారని ఆ కమీటీ దృఢంగా ఉండాల్సి ఉందని అభిప్రాయ పడ్డారు. జూమ్‌ మీటింగ్‌లకు తాము హాజరు కామని హనుమంతురావు స్పష్టం చేశారు. క్రమ శిక్షణ కమిటీ నిర్ణయాలు మీడియా ముందు వెల్లడించొద్దని సీనియర్‌ నేతలు సూచించారు.

డీసీసీలపై నివేదికకు ఆదేశం..

సభ్యత్వం సక్రమంగా జరగడం లేదని… నెమ్మదిగా జరుగుతోందని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యత్వం ప్రక్రియను వేగవంతం చేయాలని ఠాగూర్ స్పష్టం చేశారు. పార్టీకి సక్రమంగా పనిచేయని డీసీసీలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి పీసీసీని ఆదేశించారు. త్వరలో చురుగ్గా పని చేయని డీసీసీలపై వేటు వేసే అవకాశం ఉంది.

గైర్హాజరైన ముఖ్యనేతలు..

పార్టీ వ్యవహారాలను ఎవరు బహిర్గతం చేసినా.. సహించేది లేదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి స్పష్టం చేశారు. ఉత్తమకుమార్‌ రెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిలకు వ్యతిరేకంగా మీడియాలో వచ్చిన కథనాన్ని పీఏసీ ఖండించింది. ఈ విషయంలో ఉపేక్షించొద్దని, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పీఏసీ స్పష్టం చేసింది. కోమటి రెడ్డి సోదరులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, వంశీచంద్​రెడ్డి తదితరులు సమావేశానికి గైర్హాజరయ్యారు.

సంబంధిత కథనాలు..

ABOUT THE AUTHOR

...view details