హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చి ప్రాణాలు కాపాడాలి. నిరంతరం రద్దీగా ఉండే హైదరాబాద్ ట్రాఫిక్ దృష్ట్యా.. ఇది ఎంతో సమన్వయంతో జరగాలి. అదీ సాయంత్రం కావస్తున్న వేళ. ఇంకాస్త సమన్వయం కావాలి. రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్తే.. సుమారు గంటన్నర సమయం పడుతుంది. అయితే.. ఈసారి ఓ కొత్త ప్రయోగాన్ని చేయాలనుకున్నారు. రోడ్డు మీదుగా తరలించే బదులు.. మెట్రోలో తీసుకెళ్తే మరింత వేగంగా తీసుకెళ్లొచ్చని వైద్యులు భావించారు. హుటాహుటిన మెట్రో అధికారులను సంప్రదించి విషయం చెప్పారు. సత్కార్యంలో భాగస్వామ్యం అయ్యేందుకు మెట్రో అధికారులు సై అనడంతో.. తరలింపు ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రారంభమైంది.
గుండెను అపోలో ఆస్పత్రికి తరలించే ప్రక్రియ మధ్యాహ్నం 4.30 గంటల సమయంలో ప్రారంభమైంది. కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్ వరకు అంబులెన్సులో రోడ్డుమార్గాన గుండెను తరలించారు. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ప్రత్యేక మెట్రో రైలులో తీసుకెళ్లారు. ఇందుకోసం తొలిసారిగా మెట్రో మార్గంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ మధ్య 21 కిలోమీటర్లు, 16 మెట్రో స్టేషన్లు ఉండగా... 40 కిలోమీటర్ల వేగంతో అరగంట లోపే గమ్యస్థానానికి మెట్రో రైల్ గుండెను చేర్చింది.