నిమ్స్‌కు చేరుకున్న గుండె.. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రారంభం హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం గ్రీన్‌ఛానల్ ద్వారా పంజాగుట్ట నిమ్స్‌కు గుండె చేరుకుంది. మలక్‌పేట్ యశోద ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1.44 గంటలకు గుండెను తీసుకుని ప్రత్యేక అంబులెన్స్ బయలుదేరింది. గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేయటం వల్ల ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా.. పంజాగుట్ట నిమ్స్‌కు 1.56కు చేరింది. కేవలం 12 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంది.
నిమ్స్ ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు వైద్యులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన ఓ కానిస్టేబుల్ హృదయాన్ని.. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న రోగికి మార్పిడి చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన వీరబాబు.. కొండాపూర్ స్పెషల్ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న విధులకు వెళ్తుండగా... గొల్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందే క్రమంలో బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు మంగళవారం ప్రకటించారు. మృతుడి హృదయాన్ని దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు రావడంతో.. పంజాగుట్టలోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న రోగికి గుండెను మార్పిడి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అధికారులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.
నిమ్స్‌లో గతంలోనూ పలుమార్లు గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించగా.. మొదటి సారి బయటి ఆస్పత్రి నుంచి నిమ్స్‌కు గుండెను తరలిస్తున్నారు. కానిస్టేబుల్ వీరబాబు గుండెను.. 30 ఏళ్లలోపు పెయింటర్‌కు అమర్చుతున్నారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న పెయింటర్ గుండె కోసం మంగళవారం జీవన్‌దాన్‌లో నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న ఒక్క రోజులోనే హృదయం లభించటం చాలా అరుదైన విషయం.
ఇదీ చూడండి: