జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించి కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులు చేపడుతున్నారన్న పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఎన్జీటీ ఆదేశాల ఉల్లంఘనలు, అవినీతిపై సీబీఐ విచారణ జరపాలంటూ సిద్ధిపేట జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ల ధర్మాసనం విచారణ జరిపింది.
కాళేశ్వరం విస్తరణ పనులపై మేం ఆదేశాలివ్వలేం : సుప్రీం - National Green Tribunal
కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులపై తాము ఆదేశాలివ్వలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ముగ్గురు సిద్దిపేట వాసులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ విషయంలో ఎన్జీటీనే ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.

ఉల్లంఘనలపై ఎన్జీటీని ఆశ్రయించలేదా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించగా.. ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ వేశామని సీనియర్ న్యాయవాది గాన్ స్లేవ్ కోర్టుకు తెలిపారు. కానీ ఎన్జీటీ ధిక్కరణ పిటిషన్‌పై సరైన ఆదేశాలు ఇవ్వనందున సుప్రీంను ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ విషయంలో తాము ఆదేశాలు ఇవ్వలేమన్న సీజేఐ ధర్మాసనం.. ఎన్జీటీలో ఆర్టికల్ 32 ప్రకారం ఎగ్జిక్యూషన్, ధిక్కరణ అప్లికేషన్లు వేసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది. ఈ అంశంలో సరైన ఫోరాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచిస్తూ.. పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది.