కరోనా వైరస్ బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించడంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో సంబంధిత ప్రాథమిక అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టిపెట్టింది. ఈ విషయంపై సోమవారం ఉన్నతస్థాయిలో కసరత్తు చేసినట్లుగా తెలిసింది. ముఖ్యంగా చికిత్సకు ఎంత ధర నిర్ణయించాలనేది కీలకం కావడంతో ఆ దిశగా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కొవిడ్ బాధితుల నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో భారీగా రుసుములు వసూలు చేయడంపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులొచ్చాయి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తే దాదాపు 77.19 లక్షల మంది ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కరోనాతో ఆసుపత్రుల్లో చేరిన రోగుల్లో ఎవరికి ఎన్ని రోజులు చికిత్స అవసరమవుతుందని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికే ప్రైవేటులో చికిత్సలపై రుసుములు ఖరారు చేసిన నేపథ్యంలో వాటి ప్రాతిపదికన మొత్తం చికిత్సకు ధరను ఖరారు చేయడంపై ఆరోగ్య శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. సాధారణ వార్డులో చికిత్సకు రూ.4 వేలు, ఆక్సిజన్ పడకకు రూ.7,500, ఐసీయూలో అయితే రూ.9 వేల చొప్పున ఒక రోజుకు వసూలు చేయాలని సర్కారు ఆదేశాల్లో పేర్కొంది.