వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు విషజ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావుతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. కరోనా వచ్చిన మొదటి రోజు నుంచి మేమున్నామంటూ ప్రజలకు ధైర్యం చెప్పి కట్టడి, చికిత్సలో అలుపెరుగని కృషి చేస్తున్నారని సిబ్బందిని అభినందించారు. అదే తరహాలో వరదల కష్ట కాలంలోనూ ప్రజలకు అండగా ఉండాలని కోరారు.
వరదల నేపథ్యంలో కలుషిత నీరు, వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరిన మంత్రి ... సీజనల్ జ్వరాలు, ఇతర ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. జ్వరం రాగానే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకోవాలని కోరారు. నీరు, ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉన్నందున కాచి వడగట్టిన నీటిని మాత్రమే తాగాలని, వేడివేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని సూచించారు.