తెలంగాణ

telangana

ETV Bharat / city

Covid Report To HC: 'కొవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నాం' - వైద్యారోగ్య శాఖ

Covid Report To HC: రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని హైకోర్టుకు వైద్యారోగ్య శాఖ నివేదించింది. ఈనెల 12 నాటికి పాజిటివిటీ రేటు అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 6.95శాతానికి చేరిందని పేర్కొంది. పాజిటివిటీ రేటు పది శాతానికి చేరితే రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించాల్సి ఉంటుందని.. ఈ నెల 12 నాటికి ఒక్క జిల్లాలోనూ అలాంటి పరిస్థితి తలెత్తలేదని తెలిపింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా సభలు, సమావేశాలు, ఇతర జన సమూహాలపై ఈ నెల 20 వరకు నిషేధం విధించినట్లు డీహెచ్ శ్రీనివాసరావు నివేదికలో తెలిపారు. ఒమిక్రాన్​ను ఎదుర్కొనేందుకు అవసరమైన సదుపాయాలు, ఔషధాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.

Health department of telangana gave Covid Report to high court
Health department of telangana gave Covid Report to high court

By

Published : Jan 16, 2022, 10:11 PM IST

Covid Report To HC: కొవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ నెల 12 నాటికి రాష్ట్రంలో కరోనా పరిస్థితులను వివరిస్తూ హైకోర్టుకు డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. ఈ ఏడాది తొలి 12 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 18,196 కేసులు నమోదయ్యాయని.. 12 నాటికి సరాసరి పాజిటివిటీ రేటు 2.76శాతం ఉందని తెలిపారు. ఈనెల 5 నుంచి 12 వరకు అత్యధికంగా మేడ్చల్​లో 6.95శాతం, జీహెచ్ఎంసీలో 5.65శాతం ఉందని.. అతి తక్కువగా వరంగల్​లో 0.32శాతం, ఆదిలాబాద్​లో 0.33శాతం పాజిటివిటీ రేటు ఉందన్నారు.

కొవిడ్​ పరీక్షా కేంద్రాలు..

ఈ నెల 12న నిపుణుల కమిటీ సమావేశమై ప్రభుత్వానికి పలు సూచనలు ఇచ్చిందన్నారు. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో జ్వరం సర్వే, ఓపీ క్లినిక్​లు నిర్వహిస్తుండటంతో పాటు.. కరోనా పరీక్షలు, ఔషధాల కిట్​లను అందుబాటులో ఉంచినట్లు డీహెచ్ వివరించారు. రాష్ట్రంలో 1231 రాపిడ్ పరీక్ష కేంద్రాలు ఉన్నాయని.. ప్రభుత్వ ఆర్టీపీసీఆర్ కేంద్రాలు 34, ప్రైవేట్​లో 76 ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు సరిహద్దులు, బ​స్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద 132 కేంద్రాల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఈ కేంద్రాన్ని పరీక్షించిన 221 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు.

ఆస్పత్రులు సిద్ధం..

రాష్ట్రంలో కొవిడ్ చికిత్సల కోసం ప్రభుత్వాస్పత్రుల్లో 56,036 పడకలు ఉండగా... ఈ నెల 12 నాటికి 1533 నిండాయని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో రోజుకు 332 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా లేకపోయినప్పటికీ... నిలోఫర్​తో పాటు బోధనాస్పత్రులు, జిల్లా వైద్య కేంద్రాలు, ఇతర ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు వివరించారు. ఈ నెల 12 నాటికి మొదటి డోసు 100శాతం.. రెండో 74శాతం పూర్తయిందని డీహెచ్ తెలిపారు.

వ్యాక్సినేషన్​పై ప్రత్యేక డ్రైవ్​లు..

ప్రధాని పిలుపు మేరకు 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నామని.. ఈ నెల 12 నాటికి 45 శాతం అంటే... 83 లక్షల 1673 మంది టీకాలు ఇచ్చామన్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 83,421 ప్రికాషనరీ డోసులు ఇచ్చినట్లు తెలిపారు. కళాశాలలు, ఇంటింటి ప్రత్యేక డ్రైవ్​లు నిర్వహిస్తున్నామని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details