తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏలూరు ఘటనపై ఏపీ సీఎం జగన్​కు ఆరోగ్య శాఖ నివేదిక

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు ఆరోగ్యశాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. మొత్తం 57,863 కుటుంబాలను సర్వే చేసినట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం కణజాల విశ్లేషణ ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మంగళవారం ఏలూరుకు డబ్ల్యూహెచ్​వో అధికారులు రానున్నారు.

jagan
jagan

By

Published : Dec 7, 2020, 7:55 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రాథమిక నివేదిక అందించారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో మొత్తం 443 మంది అస్వస్థతకు గురవ్వగా.. ప్రస్తుతం 200 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 243 మంది డిశ్ఛార్జి అయినట్లు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం 16 మందిని విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించినట్లు వివరించారు. బాధితుల్లో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఏలూరు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఐదుగురికి చికిత్స అందించి డిశ్ఛార్జి చేసినట్లు పేర్కొన్నారు. బాధితుల్లో ఒక్కసారి మాత్రం 3–5 నిమిషాలపాటు మూర్ఛ, మతిమరుపు, ఆందోళన, వాంతులు, తలనొప్పి, వెన్నునొప్పి, నీరసం వంటి లక్షణాలు ఉన్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

అంతు చిక్కని కారణం

ఇప్పటివరకూ ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదని.. తీవ్రత కూడా తక్కువగానే ఉందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. మూర్ఛ ఒకేసారే వస్తుందని అన్నారు. ఏలూరు మున్సిపాలిటీ నీరు‌ పంపిణీ లేని ప్రాంతాల్లో కూడా ప్రజలు అస్వస్థతకు గురయ్యారని వివరించారు. ప్రత్యేకించి పలానా వయసువారికి మాత్రమే అస్వస్థత వస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రోజూ మినరల్‌ వాటర్‌ తాగేవాళ్లు కూడా అస్వస్థతకు గురయ్యారని నివేదికలో వివరించారు. తాగునీరు, పాలు, రక్త పరీక్షల్లో ఫలితాలు సాధారణంగానే ఉన్నాయని వివరించారు. సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ విశ్లేషణ కోసం హైదరాబాద్‌ సీసీఎంబీకి 10 నమూనాలను పంపించామని... వాటి ఫలితం రావాల్సి ఉందని నివేదికలో పొందుపరిచారు.

ఇంటింటి సర్వే

ఏలూరు పరిసర ప్రాంతాల్లో 62 గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారని అధికారులు తెలిపారు. 57,863 కుటుంబాలపై ఆరోగ్య సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. దీనివల్ల 191 మంది బాధితులను గుర్తించామని... వారిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ విజయవాడకు ఏడుగురిని తరలించగా... వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మరోవైపు మంగళవారం ఏలూరుకు డబ్ల్యూహెచ్​వో అధికారులు రానున్నారు.

ఇదీ చదవండి:ఏలూరు బాధితులను పరామర్శించిన జగన్

ABOUT THE AUTHOR

...view details