Ugadi 2022: ఉగాది పచ్చడిలో వాడే ఆరు రుచుల్లో.. మధుర రసం అంటే చెరకు, అరటిపండు, బెల్లం; ఆమ్ల రసంగా.. చింతపండు; లవణ రసంగా.. ఉప్పు; కటు రుచిగా.. పచ్చిమిర్చి/కారం; తిక్తరుచి (చేదు)గా.. వేప పువ్వు; కషాయం (వగరు) రుచిగా.. మామిడి పిందెలను వాడతాం. వీటిని ఎక్కువ, తక్కువ పరిమాణంలో నిత్యం ఆహారం ద్వారా తీసుకుంటూ ఉండాలి. అప్పుడే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.
వేప పువ్వే ప్రధానం.. :వసంత రుతువు, చైత్రమాసం, పాడ్యమితో మొదలయ్యే తెలుగు సంవత్సరాది రోజున ఆరు రుచుల కలయికతో చేసే ఉగాది పచ్చడి ప్రత్యేకమైంది. ఇందులో వేపపువ్వు పాత్ర కీలకం. ఈ కాలంలో శరీరంలో పెరిగే కఫ దోషాన్ని వేప పువ్వు తగ్గిస్తుంది. మలినాల్ని పోగొట్టి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల కడుపులో పురుగులు నశిస్తాయి.
1. తీపి:మానసిక ఉల్లాసానికి అతి ముఖ్యమైంది తీపి. అలాగని చక్కెరతో తయారయ్యే స్వీట్లు, కేకులు, చాక్లెట్లకు బదులుగా.. బియ్యం, గోధుమ వంటి ధాన్యాలు, పండ్లు, కూరగాయలు మొదలైనవి తీసుకోవాలి. శరీరానికి అవసరమైన చక్కెర(పిండి పదార్థాలు) వీటి నుంచి అందుతుంది. ఇది శరీరంలోని కణాలు నశించిపోకుండా, కొత్త కణాల పెరుగుదలకు.. వాతం, పిత్తం పెరగనివ్వకుండా అదుపులో ఉంచుతుంది. డైటింగ్ పేరుతో వీటిని ఆహారంలో తీసుకోకుండా ఉండడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకే తీపిని పరిమితంగా తీసుకుంటే మంచిదన్న విషయం గుర్తుంచుకోవాలి.
2. పులుపు..:ఈ రుచి ఆహారం జీర్ణం కావడానికి, మలబద్ధకం లేకుండా ఉండడానికి, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుంది. దీన్ని తక్కువగా తీసుకోవాలి. ఈ రుచిని ఆహారంలో చేర్చుకోకపోతే జీర్ణశక్తి దెబ్బతింటుంది. అలాగే ఎక్కువగా తీసుకున్నా కూడా రక్తంపై ప్రతికూల ప్రభావం పడి.. పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది.
3. ఉప్పు..:శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలను ఉప్పు అందిస్తుంది. ఆకలి, జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే దీన్ని కొద్ది పరిమాణంలోనే తీసుకోవాలి. ఖనిజ లవణాలు మనం వాడే ఉప్పు నుంచే కాకుండా కాయగూరలు, పండ్ల నుంచి కూడా అందుతాయి. ఉప్పును ఎక్కువగా వినియోగించే ఊరగాయలు, చిప్స్, నిల్వ ఉంచే ఆహార పదార్థాలు, రసాయనాలు చేర్చిన వాటిని ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలకు హాని కలుగుతుంది. చర్మం ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. కీళ్ల వాతం, గ్యాస్ట్రిక్.. వంటి సమస్యలు దరిచేరతాయి.