తెలంగాణ

telangana

ETV Bharat / city

బస్తీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న హెచ్‌సీయూ విద్యార్థులు - హెచ్‌సీయూ విద్యార్థులు

వారంతా బస్తీ పిల్లలు. చదువుకోవాలనే తపన ఉన్నా.. అక్షర బుద్ధులు నేర్పించే వాళ్లు మాత్రం కానరాలేదు. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడగా.. ఏడు నెలలుగా ఆ పిల్లలు చదువుకు దూరమయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు విద్యార్థులు.. బస్తీ పిల్లలకు బోధించేందుకు మేమున్నామంటూ ముందుకొచ్చి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.

hcu phd students teach to basti students in hyderabad
బస్తీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న హెచ్‌సీయూ విద్యార్థులు

By

Published : Oct 9, 2020, 7:18 AM IST

బస్తీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న హెచ్‌సీయూ విద్యార్థులు

లాక్‌డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడడంతో చాలా మంది బస్తీ పిల్లలు చదువుకు దూరమయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా... పాఠశాలల పేరిట బస్తీలు, మురికివాడల్లో ఉన్న పిల్లలకు బోధన అందించాలని ఏబీవీపీ విద్యార్థి విభాగం పిలుపునిచ్చింది. అందులో భాగంగా హెచ్​సీయూ విద్యార్థులు బస్తీ పాఠశాల ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకుగానూ వర్సిటీ సమీపంలోని గోపాన్‌పల్లి ప్రాంతాన్ని వారు ఎంచుకున్నారు. ఏబీవీపీ అధ్యక్షుడు అజీత్‌కుమార్ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం వద్ద వారం రోజుల క్రితం బస్తీ పాఠశాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వర్సిటీలో విద్యార్థులు లేకపోవడంతో రీసర్చ్​ స్కాలర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

పది మందితో ప్రారంభమై..

తొలుత పదిమంది విద్యార్థులతో ప్రారంభం కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 35కు చేరింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. హెచ్​సీయూ విద్యార్థుల విద్యాబోధన రోజూ సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర వరకు కొనసాగుతుంది. బస్తీ పాఠశాలల్లో ఏడుగురు పీహెచ్​డీ విద్యార్థులు బోధిస్తున్నారు. వీరంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్సిటీలోనే ఉండి తమ కోర్సుకు సంబంధించిన పరిశోధనలో భాగస్వాములవుతున్నారు. సాయంకాలం వేళ గోపాన్‌పల్లి బస్తీకి చేరుకుని చిన్నారులకు చదువు నేర్పిస్తూ.. సందేహాలను నివృత్తి చేస్తున్నారు.

బస్తీ పాఠశాలకు ఆదరణ

ప్రారంభంలో తక్కువ మంది విద్యార్థులు వచ్చినప్పటికీ.. క్రమంగా బస్తీ పాఠశాలకు ఆదరణ పెరిగిందని హెచ్​సీయూ విద్యార్థులంటున్నారు. ఈ ఉత్సాహంతో మరో బస్తీ పాఠశాలను ప్రారంభించాలనే ఆలోచన ఉన్నట్లు వారు వెల్లడించారు.

ఇవీ చూడండి:'ప్రపంచానికి ఔషధ కర్మాగారంలా భారత్​'

ABOUT THE AUTHOR

...view details