లోతైన అధ్యయనం తర్వాతే అమరావతిని ఏపీ రాజధాని(Amaravati as AP Capital)గా చట్టబద్ధంగా నిర్ణయించారని, నిర్మాణం కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేశారని, ఈ నేపథ్యంలో మూడు రాజధానుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడానికి వీల్లేదని ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఏపీ విభజన చట్టప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నూతన రాజధాని విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందన్నారు. ఆ కమిటీ అధ్యయనంలో 52 శాతం ప్రజలు విజయవాడ-గుంటూరు మధ్య, 10.72 శాతం మంది విశాఖపట్నం వద్ద రాజధానికి మద్దతు తెలిపారన్నారు. ఆ తర్వాతే అమరావతిని రాజధాని(Amaravati as AP Capital)గా అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దాన్ని తర్వాత వచ్చే ప్రభుత్వాలు కొనసాగించాలన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సరికాదన్నారు. మూడు రాజధానుల శానసం చేసే అధికారం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. శాస్త్రీయ అధ్యయనం చేసి చట్టబద్ధంగా రూపొందించిన అమరావతి మాస్టర్‌ప్లాన్(AP master plan) అమలు చేయకపోతే అమరావతి ఆత్మను తీసేసినట్లేనన్నారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ.. రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, మరికొంతమంది రైతులు హైకోర్టు(AP high court)లో వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హైబ్రిడ్ విధానం (వీడియో కాన్ఫరెన్స్, భౌతిక పద్ధతి)లో సోమవారం రోజువారీ తుది విచారణ ప్రారంభించింది. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఉద్దేశపూర్వకంగా ఘోస్ట్ సిటీగా మార్చారు
శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ.. మూడు రాజధానుల(Three capital issue in AP) నిర్ణయం అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించడమేనన్నారు. ‘అమరావతి కోసం 29 గ్రామాలకు చెందిన 30 వేల రైతు కుటుంబాలు జీవనాధారాన్ని త్యాగ్యం చేశాయి. అందులో 26,700 మంది చిన్నరైతులే. భూములిచ్చినందుకు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్లాట్లకు.. మూడు రాజధానులొస్తే విలువ లేకుండా పోతుంది. విభజన చట్టంలో ఒక రాజధాని గురించే ప్రస్తావన ఉంది. మూడు రాజధానుల గురించి లేదు. అంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకచోటే ఉండాలి. ఇప్పటికే రాజధాని అమరావతి(Amaravati as AP Capital) నిర్మాణంలో రూ.5,674 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం వాటన్నింటినీ విస్మరిస్తూ.. వివిధ ప్రాజెక్టు పనులను ఎక్కడికక్కడ వదిలేసింది. ఉద్దేశపూర్వకంగా రాజధాని ప్రాంతాన్ని దెయ్యాల నగరం (ఘోస్ట్ సిటీ)గా మార్చేసింది. వివిధ కమిటీలతో అధ్యయనం చేయించి మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొచ్చి దానికి న్యాయబద్ధత ఉన్నట్లు చూపించే యత్నం చేసింది. ఓసారి నిర్ణయం జరిగిన రాజధాని విషయంలో అధ్యయనం చేయించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదు’ అని అన్నారు.