వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై డిసెంబర్ 3 వరకు స్టే - hc hearing on dharani portal
17:15 November 25
వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై డిసెంబర్ 3 వరకు స్టే
ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియపై స్టే ఉత్తర్వులను డిసెంబరు 3 వరకు హైకోర్టు పొడిగించింది. ధరణిలో ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియను సవాల్ చేస్తూ... దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఆధార్ వివరాలు అడగటం చట్టబద్ధం కాదని.. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని పిటిషనర్లు వాదనలు కొనసాగించారు.
అదే విధంగా డిజిటల్ డేటాకు చట్టబద్ధమైన రక్షణ లేదని వాదించారు. ఇవాళ వాదనలు పూర్తి కాకపోవడం వల్ల... తదుపరి విచారణను డిసెంబరు 3కు హైకోర్టు వాయిదా వేసింది. అయితే రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు వీలుగా గతంలో ఇచ్చిన స్టే ఎత్తివేయాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. ఆధార్ వివరాల సేకరణపై చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నందున.. అది తేలేవరకు స్టే ఎత్తివేయలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వారం రోజులకు వాయిదా వేయకుండా రేపు సైతం వాదనలు కొనసాగించాలని ఏజీ కోరగా.. హైకోర్టు నిరాకరించింది.
ఇదీ చూండడి: మళ్లీ లాక్డౌన్పై రాష్ట్రాలకు కేంద్రం క్లారిటీ