భాగ్యనగరంలో బస్ట్ కేక్‌ల తయారీ కొత్తగా వచ్చింది. ఓ అభిమాని తన హీరోకు, ఓ తండ్రి తన కూతురికి, అభిమాన గాయనికి ఆ కేక్‌లను సర్ ప్రైజ్‌లుగా ఇస్తున్నారు. ఇటీవలే మొదలైన ఈ పోకడకు ఆజ్యం పోసింది హైదరాబాద్‌కు చెందిన డి.రాధ. సరదాగా నేర్చుకున్న విద్య ప్రస్తుతం ఆమెకు ఓ వ్యాపారం ప్రారంభించేలా చేసింది. సినిమా వేడుకలకు, ప్రముఖుల పుట్టిన రోజులకు బస్ట్ కేక్‌లను ఆర్డర్ మీద తయారుచేసి పంపిస్తున్నారు.
తయారీ కోసం
దిల్లీలో ఉన్న సమయంలో శిల్పాలను నేర్చుకోవడంలో శిక్షణ పొందిన రాధ ఆనంతరం అనేక శిల్పాలను మలిచారు. ఈజిప్టు బొమ్మ, సరోజిని నాయుడు, రాబిన్ విలియంసన్, మలాలా తదితర ప్రముఖుల శిల్పాలను ఆమె చెక్కారు. రాధ తన కూతురి పుట్టిన రోజు వేడుకలకు తొలిసారిగా బస్ట్ కేక్ ను తయారు చేశారు. శిల్పాలను తయారుచేసే నైపుణ్యాన్ని కేక్‌పై ఎందుకు ప్రయోగించకూడదని ఆలోచించి తొలి ప్రయత్నం చేశారు. బస్ట్ కేక్ తయారీ కోసం మెల్ట్ చేసిన చాక్ లేట్, శరీరాకృతికోసం కేక్, రైస్ రెసిపీలను వాడి తన కూతురి ముఖ నమూనాతో బస్ట్ కేక్‌ను తయారు చేసి అందర్నీ అబ్బురపరిచారు.
టాలీవుడ్ ప్రముఖుల నమునా
అప్పటి నుంచి తన బంధువులు, స్నేహితులు తమ పిల్లల పుట్టిన రోజులకు అలాంటి కేక్‌ను తయారు చేయాలంటూ చెప్పడం మొదలు పెట్టారు. అలా నెమ్మదిగా బయటివాళ్లు ఆర్డర్లు ఇవ్వడం వల్ల సరదాగా నేర్చుకున్న విద్య వ్యాపారంగా మారిపోయింది. సుమారు రెండు సంవత్సరాలు నైపుణ్యం సాధించిన తర్వాత టాలీవుడ్ ప్రముఖుల ముఖ నమూనాలతో బస్ట్ కేక్‌లను తయారు చేయడం మొదలు పెట్టారు. అలా నాగబాబు, సునీత, చిరంజీవి నమూనాలతో బస్ట్ కేక్‌లను వారి అభిమానులకు అందించారు. సైరా నర్సింహారెడ్డి సినిమా విడుదల సమయంలో ఓ అభిమాని బస్ట్ కేక్‌ను చిరంజీవికి అందించారు.