తెలంగాణ

telangana

ETV Bharat / city

SHORTEST LAWYER: ఎగతాళిని ఎదిరించి.. ఎదిగింది! - దేశంలోనే తక్కువ పొట్టి లాయర్​ హర్విందర్​ కౌర్​

పదేళ్ల వరకూ ఆ అమ్మాయీ అందరిలానే ఉంది. ఆడుతూ పాడుతూ సాగుతున్న బాల్యంలో మార్పులు మొదలయ్యాయి. దాంతో కుంగుబాటుకు గురైంది. కానీ ఆమె అంతటితో ఆగిపోలేదు. అవరోధంగా భావించిన దాన్నే గుర్తింపుగా మార్చుకుంది. ఇంతకీ ఎవరామె? ఏమా కథ?

SHORTEST LAWYER: ఎగతాళిని ఎదిరించి.. ఎదిగింది!
SHORTEST LAWYER: ఎగతాళిని ఎదిరించి.. ఎదిగింది!

By

Published : Jul 29, 2021, 10:21 AM IST

హర్విందర్‌ కౌర్‌ నాలుగో తరగతి వరకూ తోటి పిల్లతోపాటుగానే ఎదిగింది. ఆపై ఎత్తు పెరగడం ఆగిపోయింది. స్కూల్లో అందరూ ఏడిపించడం ప్రారంభించారు. తట్టుకోలేక రోజూ ఇంటికొచ్చాక ఏడ్చేది. అమ్మానాన్నలు ఎందరో వైద్యులను సంప్రదించినా, మందులు వాడినా ఫలితం లేకపోయింది. హేళన తట్టుకోలేక స్కూలుకెళ్లడం మానేసింది. ఇంటి దగ్గర్నుంచే ప్రైవేటుగా చదివి పరీక్షలు రాసేది. పదో తరగతి వరకూ అలానే కొనసాగించింది. పై చదువులకు కళాశాలకు వెళ్లాల్సి వస్తుందని చదువే ఆపేద్దామనుకుంది.

దేశంలోనే తక్కువ ఎత్తున్న న్యాయవాది

ఈమెది పంజాబ్‌లోని జలంధర్‌. నాన్న ఏఎస్‌ఐ, అమ్మ గృహిణి. వాళ్లు తన భవిష్యత్‌ గురించి కంగారు పడుతూ ఉండేవారు. ఓసారి యూకేలో చదువుతున్న తన అన్నతో మాట్లాడటం వింది. అమ్మానాన్నల్ని తను ఎంత కంగారుపెడుతోందీ అర్థం చేసుకుంది. తన కాళ్లమీద తాను నిలబడాలని నిర్ణయించుకుని, కళాశాలలో చేరింది. తాను భయపడ్డంత భయంకరంగా పరిస్థితులేమీ లేవు. ఆమెకు ఏర్‌హోస్టెస్‌ కావాలని కోరిక. కానీ ఆమె ఎత్తు మూడు అడుగుల 11 అంగుళాలే. ఇక అది సాధ్యం కాదని అర్థమైంది. న్యాయవిద్యను ఎంచుకుంది. ఎల్‌ఎల్‌బీ చేసి జలంధర్‌ కోర్టులో ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. దేశంలోనే తక్కువ ఎత్తున్న న్యాయవాదిగానూ గుర్తింపు పొందింది.

‘మొదట్లో తోటి పిల్లల వెక్కిరింతలు విని బాధపడే దాన్ని. నేనేమీ చేయలేననే అపనమ్మకం మొదలైంది. స్కూల్లో ముందు వరుసలో ప్రత్యేక బల్ల ఏర్పాటు చేయడం అవమానంగా తోచేది. నా గురించి అమ్మానాన్నా పడుతున్న కంగారు నాలో మార్పు తెచ్చింది. వేరే ఎవరో కాదు, నన్ను నేనే అంగీకరించలేకపోతున్నానని అర్థమైంది. ఆ అవగాహన వచ్చాక ఎవరేమన్నా పట్టించుకోవడం మానేశాను. చదువుపైనే దృష్టి పెట్టాను. నన్ను వెక్కిరించిన వారే ఇప్పుడు గౌరవంగా చూస్తుండటం ఆనందంగా ఉంది. అమ్మా నాన్నా నన్ను చూసి గర్వపడుతున్నారు. అంతకంటే ఏం కావాలి?’ అంటోంది 24 ఏళ్ల హర్వీందర్‌. జడ్జి స్థాయికి ఎదిగి, అవసరమైనవారికి సాయమందించడం తన లక్ష్యమంటోంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details