బడ్జెట్ ప్రసంగంలో కేంద్రంపై హరీశ్ రావు ఫైర్ Harish Rao Comments on Central Government: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రోత్సాహం అందించకపోగా.. నిరుత్సాహ పరుస్తోందని మండిపడ్డారు. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాల అధికారాలను కాలరాస్తోందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను.. ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టడంతో ప్రారంభమైన వివక్ష.. అలాగే కొనసాగుతోందన్నారు. లోయర్ సీలేర్ విద్యుత్ ప్రాజెక్టు కోల్పోవాల్సి వచ్చిందని.. హైకోర్టు ఏర్పాటు చేయకుండా ఐదేళ్లు తాత్సారం చేసిందని విమర్శించారు.
ప్రధానికి చెప్పినా ప్రయోజనం సున్నా..
Harish Rao Comments on Modi Government: విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడం లేదని హరీశ్ రావు అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలు చేసి ఉంటే.. తెలంగాణ ఐటీ రంగంలో మరింత పురోగమించి లక్షల మందికి ఉపాధి లభించేదని తెలిపారు. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాలను కేంద్రం వెనకబడినవిగా గుర్తించిందన్న హరీశ్‌రావు.. ఆ నిధులు ఇవ్వడంలోనూ జాప్యం చేస్తోందన్నారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని కోరామని.. ఎన్నో ప్రతిపాదనలు పంపామని.. నేరుగా సీఎం కేసీఆర్ ప్రధానికి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆక్షేపించారు.
కంటి తుడుపుగా నిధుల కేటాయింపులు
Harish Rao on Telangana Budget 2022: మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వలేదని.. బయ్యారం, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని అటకెక్కించారని, రైల్వే కనెక్టివిటీ ప్రతిపాదనలు పెండింగ్‌లో పెట్టారని ఆర్థికమంత్రి మండిపడ్డారు. గిరిజన యునివర్సిటీకి కంటితుడుపుగా రూ.20 కోట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రూ.495 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ చేసిందని.. ఏడేళ్లుగా అడుగుతున్నా ఇవ్వడం లేదని వాపోయారు. జహీరాబాద్ నిమ్జ్‌కు కేంద్రం వాటా రూ.5 వందల కోట్లు ఇంకా విడుదల చేయలేదని హరీశ్‌రావు ఆరోపించారు.
Harish Rao Fires on Central : "కరోనాతో దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా.. రాష్ట్రాలకు అదనంగా కేంద్రం ఒక్కరూపాయి ఇవ్వలేదు. న్యాయ సమ్మతంగా దక్కాల్సిన నిధుల్లో కోత విధించింది. ఎఫ్‌ఆర్‌బీఎం పెంపుదలకు విద్యుత్ సంస్కరణలకు లంకెపెట్టడం దారుణం. రాష్ట్రాలకు పన్నుల్లో 41 శాతం వాటాగా దక్కాల్సి ఉన్నా దాన్ని కూడా తగ్గించారు. 29.6 శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చి.. సెస్సుల రూపంలో దొడ్డిదారిన ఆదాయం 11.4 శాతం ఆదాయానికి కేంద్రం గండికొడుతోంది. ఇన్ని రకాల ప్రతికూలతలు, పరిమితుల మధ్య రాష్ట్రం బలీయమైన శక్తిగా ఎదుగుతోంది."
- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి