తెలంగాణ

telangana

ETV Bharat / city

త్వరలో వెయ్యి వైద్యుల పోస్టులకు నోటిఫికేషన్‌ - ఉద్యోగ ప్రకటన

Harish Rao on Job Notification: రాష్ట్రంలో త్వరలోనే వెయ్యి వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయబోతున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, పీహెచ్‌సీలో పనిచేయడానికి ఈ పోస్టులను భర్తీ చేయబోతున్నామని చెప్పారు. గాంధీ వైద్య కళాశాల మైదానంలో 2016 బ్యాచ్‌ విద్యార్థులకు పట్టాలను అందజేసే కార్యక్రమంలో హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Harish Rao
Harish Rao

By

Published : Jun 5, 2022, 6:38 AM IST

Harish Rao on Job Notification: వెయ్యి వైద్యుల పోస్టుల భర్తీకి తెలంగాణలో త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయబోతున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, పీహెచ్‌సీలో పనిచేయడానికి ఈ పోస్టులను భర్తీ చేయబోతున్నామని తెలిపారు. శనివారం రాత్రి గాంధీ వైద్య కళాశాల మైదానంలో 2016 బ్యాచ్‌ విద్యార్థులకు పట్టాలను అందజేసే కార్యక్రమంలో హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మీరంతా ప్రభుత్వ దవాఖానాల్లో ఉద్యోగం చేయగలితే ఎంతోమంది పేదలకు మేలు జరుగుతుందని’ విద్యార్థులతో అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి ఇష్టపడే వారి సర్వీస్‌ను కౌంట్‌ చేస్తూ ప్రభుత్వ, పైవేటు వైద్య కళాశాలల్లో పీజీ అడ్మిషన్స్‌లో 30 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ సంవత్సరం దాదాపు 200 మంది పీహెచ్‌సీ డాక్టర్లు పీజీ అడ్మిషన్‌ పొందారన్నారు. 2014లో తెలంగాణ ప్రభుత్వ రంగంలో పీజీ సీట్లు 570 ఉండేవనీ, వాటి సంఖ్యను 1212 సంఖ్యకు పెంచబోతున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణలో మూడు కాలేజీలు మంజూరైతే, తెలంగాణ ఏర్పడ్డాక వాటి సంఖ్యను 33కు పెంచాలని సీఎం నిర్ణయించారన్నారు. 700 ఎంబీబీఎస్‌ సీట్లను ఈ ఏడాది నుంచి 2,840కి పెంచబోతున్నామనీ, రానున్న రోజుల్లో ఈ సంఖ్య 5240కు చేరుకుంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, వరంగల్‌లో హెల్త్‌సిటీ రాబోతున్నాయని చెప్పారు. ప్రభుత్వ వైద్యరంగంలో చేరండి, సేవ చేయండి, గొప్ప అనుభూతిని పొందండని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

మనసుకు గాయం చేయొద్దు...:తమ కోసం, పని చేస్తున్న సంస్థ అభివృద్ధి కోసం చేసేది ఉద్యోగం... కానీ ప్రజలకోసం వైద్య రంగంలో ఉండడం అభినందనీయమని హరీశ్‌ పేర్కొన్నారు. ‘ప్రభుత్వాసుపత్రుల్లో కొందరు వైద్యులు, నర్సులు వైద్యం చేస్తున్నారు కానీ, మాటలతో మనసుకు గాయం చేస్తున్నారు. మీ మాటతీరే సగం రోగాన్ని నయం చేస్తుంది. రోగులపై ప్రేమ, ఆప్యాయతతో ఉండండి’ అని మంత్రి సూచించారు. కార్యక్రమంలో టీఎస్‌ ఎంఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ కరుణాకర్‌రెడ్డి, డీఎంఈ రమేష్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ రాజారావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి...దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే అలక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందాలని తెలిపారు. కోఠిలోని టీఎస్‌ఎంఐడీసీ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో పాజిటివిటీ గత రెండు వారాల్లో 0.4, 0.5 శాతం మాత్రమే ఉంది... అయినా అప్రమత్తంగా ఉండాల’’ని ప్రజలను కోరారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఇంకా టీకా వేసుకోని వారికి వేయాలని హరీశ్‌రావు వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

కొత్తగా 76 కరోనా కేసులు..రాష్ట్రంలో శనివారం కొత్తగా 76 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7,93,544కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 11,107 మందికి పరీక్షలు నిర్వహించగా, అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 55 మందికి, రంగారెడ్డిలో 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణయింది. శనివారం మరో 49 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 7,88,886కి చేరింది. మరో 547 మంది చికిత్స, ఐసొలేషన్‌లో ఉన్నారు.

ఇవీ చదవండి:మళ్లీ కొవిడ్ విజృంభణ... నిబంధనలు పాటించాల్సిందే: మంత్రి హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details