తెలంగాణ

telangana

ETV Bharat / city

హనుమాన్ జన్మస్థలం ప్రకటన: 'శ్రీవారి ఆశీస్సులతో సాధ్యమైంది' - తెలంగాణ వార్తలు

అయోధ్యలో శ్రీరాముడి భవ్యమందిరం నిర్మితమవుతున్న వేళ... వేంకటాచలాన్నే అంజనాద్రిగా ప్రకటించగలగడం.. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో సాధ్యమైందని తితిదే ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో లోకకల్యాణం కోసం సుందరకాండ అఖండ పారాయణాన్ని ఏడాదిగా నిర్వహిస్తున్న చోటు నుంచే.. రామభక్తుడైన హనుమాన్ జన్మస్థలంపై ప్రకటన చేయటం అద్భుతమైన ఘట్టమని తితిదే ఉన్నతాధికారులు ప్రకటించారు.

hanuman birth place by ttd, tirumala tirupati devasthanam
హనుమాన్ జన్మస్థలం, తితిదే ప్రకటన

By

Published : Apr 21, 2021, 5:46 PM IST

శ్రీరామనవమి పర్వదినాన సుదీర్ఘ కాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు తిరుమల తిరుపతి దేవస్థానం తెరదింపే ప్రయత్నం చేసింది. రామచంద్రమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆంజనేయుడి జన్మస్థలంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న తరుణంలో.. వేంకటాచలమే హనుమంతుడు పుట్టిన అంజనాద్రిగా ప్రకటిస్తూ తితిదే అధికారిక ప్రకటన చేసింది. తిరుమల నాదనీరాజనం మండపం వేదికగా పండితుల కమిటీ సహేతుకంగా నిర్ధరించిన ప్రకటనలపై తితిదే ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

సుందరకాండ అఖండ పారాయణం, హనుమాన్ జన్మస్థలం ప్రకటనకు శ్రీవారి ఆశీస్సులే కారణమని తితిదే ఈవో కేఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. అయోధ్యలో శ్రీరాముని ఆలయం నిర్మితమవుతున్న వేళ ఆంజనేయ జన్మస్థలం గురించి ప్రకటన శ్రీవారి నిర్ణయంగా భావిస్తున్నామన్నారు. పండిత పరిషత్​కు, కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. దైవ నిర్ణయం ఇదే అయితే.. ఎలాంటి వివాదాలు రావని ఆశాభావం వ్యక్తం చేశారు. పండితుల కమిటీ పరిశోధించిన ఆధారాలను.. రెండు నెలల్లో పుస్తక రూపంలోకి తీసుకొస్తామని ఈవో తెలిపారు.

కరోనా కారణంగా ఏడాది కిందట సుందరకాండ పారాయణం ప్రారంభించిన చోటే.. కాకతాళీయంగా వేంకటాద్రినే అంజనాద్రిగా ప్రకటించే భాగ్యం దక్కిందని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. లోకకల్యాణం కోసం చేపట్టిన కార్యక్రమం మరో అద్భుత ఘట్టానికి ప్రేరణను ఇచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆకాశగంగ సమీపంలోని జాపాలి తీర్థాన్ని ఆంజనేయుడి జన్మస్థానంగా ప్రకటించిన సందర్భంగా.. అక్కడ ఉన్న ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధిపై ప్రణాళికలు చేస్తామని తితిదే అధికారులు తెలిపారు. తితిదే పాలకమండలి సమావేశంలోనూ జాపాలి ఆలయ అభివృద్ధిపై చర్చిస్తామని వివరించారు.

హనుమాన్ జన్మస్థలం, తితిదే ప్రకటన

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details