కష్టాల కడలి ఈదుతూ.. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ఈ ఒంటి చేతి వీరుడు... తేజిందర్ మెహ్రా. దిల్లీలోని ఓ నిరుపేద కుటుంబంలో ఒంటి చేత్తోనే పుట్టాడు మెహ్రా. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న తమకు భవిష్యత్‌కు భారమని 2నెలల పసికందుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు వదిలించుకున్నారు. 20 వేలకు అమ్మకానికి పెట్టారు.
ఆ ప్రయత్నాల్ని మేనత్త అడ్డుకుంది.. తానే మెహ్రాను చూసుకుంటానని చేరదీసింది. ఉన్నంతలో చదివించింది. చిరుప్రాయంలో... స్నేహితులు బైక్ నడపడం, జిమ్‌లకు వెళ్లడం చూసి తానెందుకు ఇలాంటి చేయలేనని అనుకున్నాడు తేజిందర్ మెహ్రా. వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాడు. వైకల్యం మెహ్రా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేకపోయింది... కానీ చుట్టూ ఉన్న సమాజం నిత్యం వెనక్కు లాగేందుకే ప్రయత్నించింది. అందుకే... ఇంటి మేడపైనే జిమ్ వర్క్ అవుట్స్ ప్రారంభించాడు. ఒంటి చేత్తో ఏదైనా సాధించి సమాజానికి తానేంటో చూపించాలనుకున్నాడు.
తేజిందర్ పట్టుదల చూసి... జిమ్‌లో కసరత్తులు చేయాలని స్నేహితులు ప్రోత్సహించారు. కానీ... ఆర్థికభారం ఉండకూడదని ప్రభుత్వ వ్యాయామశాలలో కసరత్తులు మొదలుపెట్టాడు. వైకల్యం బలహీనత కాకుడదు, ఇతరులు లోపంగా చూసిన దేహమే బలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పట్టువిడవక సాధన చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు చిన్నచిన్న పనులకే ఇబ్బంది పడ్డ మెహ్రా... పెద్దపెద్ద బరువులు ఎత్తే స్థాయికి చేరుకున్నాడు.
మెహ్రా పట్టుదల చూసి ప్రైవేట్ జిమ్ ట్రైనర్ దినేష్.. తన జిమ్‌లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ట్రైనర్ ప్రత్యే శ్రద్ధ, మోహ్రా కఠోర శ్రమతో కండలు తిరిగిన శరీరం సొంతమైంది. శరీరకంగానే కాగా.. మానసికంగానూ రెట్టింపు బలం సొంతం చేసుకున్న మెహ్రా... 2017 మిస్టర్ దిల్లీ బరిలో దిగాడు.