Duggirala Case: ఏపీ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచార ఘటన స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ కేసును ఛేదించిన పోలీసులు.. అసలు ఈ ఘటనలో అత్యాచారమే జరగలేదని తేల్చారు. బాధిత మహిళకు ఓ వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. మహిళను హత్య చేసిన నిందితుడు శివసత్య సాయిరాంతో పాటు ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న వెంకట సాయి సతీష్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు.
‘హతురాలి ఇంటికి వెంకట సాయి సతీష్, అతని స్నేహితుడుశివసత్య సాయిరాం వెళ్లాడు. తన కోరిక తీర్చాలని శివసత్య సాయిరాం మహిళను వేధించాడు. అయినప్పటికీ ఆమె నిరాకరించింది. ఈ విషయం గురించి అందరికీ చెబుతానని హతురాలు బెదిరించడంతో ఆమె చీరనే మెడకు బిగించి హత్య చేశాడు’అని ఎస్పీ వివరించారు. ఈ ఘటన సామూహిక అత్యాచారం కాదని.. ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం కూడా లేదని ఎస్పీ స్పష్టం చేశారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
అసలేం జరిగింది :బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తిరుపతమ్మ బంధువైన ఓ యువకుడు ఆమెను కలవడానికి ఇంటికి వెళ్లాడు. ఆమె ఒంటిపై దుస్తులు సక్రమంగా లేకుండా అచేతనంగా పడి ఉండటం గమనించి పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. తిరుపతమ్మకు పదిహేనేళ్ల కిందట శ్రీనివాసరావు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పొలాలకు నీళ్లు పెట్టే ట్యూబులు అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాసరావు పనుల కోసం గ్రామం విడిచి వెళుతుంటాడు. ఒకసారి వెళ్తే ఐదు, ఆరు నెలలు ఇంటికి రారు.