రాష్ట్రంలో ఛౌక ధరల దుకాణాల డీలర్లు పౌరసరఫరాల సంస్థకు అందజేసే గన్నీ సంచుల ధర రూ.18 నుంచి 21 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో జరిగిన 26వ బోర్డు సమావేశంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు ఈ నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కమీషన్ పెంపునకు సంబంధించి రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన రూ. 54 కోట్లు విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. ప్రతి నెల 87.54 లక్షల కుటుంబాలకు ప్రతి నెల 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. బియ్యం పంపిణీ తర్వాత డీలర్ల దగ్గర ప్రతి నెల 30 లక్షల గన్నీ సంచులు ఉండిపోతున్నాయి. గతంలో ఈ సంచులను డీలర్లు ప్రైవేట్ గన్నీ బ్యాగుల కంట్రాక్టర్లకు అమ్ముకునేవారు.
ప్రతి సంచి సంస్థకే...
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యల ఫలితంగా పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడులు పెరగడం, పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోళ్ళు జరుపుతుండటం వల్ల గన్నీ సంచుల వినియోగం భారీగా పెరిగింది. ఈ యాసంగి సీజన్‌లో 9 కోట్ల పాత గన్నీ సంచులు అవసరమవుతాయి. పాత గన్నీ సంచుల వినియోగం పెరగడం వల్ల డీలర్లు కచ్చితంగా గన్నీ బ్యాగులు పౌరసరఫరాల సంస్థకు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి గన్నీ సంచి సంస్థకే విక్రయించేలా అదనపు కలెక్టర్లు, జిల్లా మేనేజర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.