Woman died in Amarnath yatra: ఏపీ నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారిలో.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మహిళ మృతిచెందారు. గునిశెట్టి సుధ అనే మహిళ మరణించారు. ఆమె మృతదేహం శ్రీనగర్ ఆస్పత్రిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో మహిళ పార్వతి ఆచూకీ కనుగొనేందుకు చర్యలు చేపట్టారు.
25 మంది ఆచూకీ దొరకట్లేదు : నెల్లూరు జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. వీరిలో ఇప్పటి వరకు 57 మంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. మరో 25 మంది ఆచూకీ దొరకడం లేదని తెలిపారు. ఆచూకీ దొరకనివారి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని చెప్పిన కలెక్టర్.. నెల్లూరు జిల్లా యాత్రికుల కోసం 1902 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.