తెలంగాణ

telangana

ETV Bharat / city

పర్వతారోహకుడు సాయికిరణ్‌ గిన్నిస్‌ రికార్డు

ఎత్తైన పర్వతాలు అధిరోహించి ఇప్పటికే మౌంటెనీర్‌గా గుర్తింపు తెచ్చుకున్న చిలకలూరిపేటకు చెందిన ఆలూరి సాయికిరణ్‌ మరో అరుదైన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సాధించాడు. ఈ ఏడాది ఆగస్టు 15న గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ మౌంటెనీర్‌కు సంబంధించి ఒక గంటలో ఫేస్‌బుక్‌లో ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. దీంతో సాయికిరణ్‌ తన మౌంటెనీరింగ్‌లో తన సాహసాలకు సంబంధించిన 995 ఫొటోలను అప్‌లోడ్‌ చేయడంతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌లో పేరు నమోదైంది. రెండు రోజుల క్రితం సాయికిరణ్‌ అవార్డు అందుకున్నాడు.

guinness-world-record-holder-mountneer-saikiran
పర్వతారోహకుడు సాయికిరణ్‌ గిన్నిస్‌ రికార్డు

By

Published : Nov 24, 2020, 4:24 PM IST

అత్యంత ఎత్తైన పర్వతాలను ఎముక‌లు కొరికే చలిలో సైతం ఎక్కేస్తాడు...ఆక్సిజన్ సిలిండ‌ర్​ను భుజాన వేసుకుని మరీ శిఖ‌రాల‌ను సునాయా‌సంగా అధిరోహిస్తాడు. ఆ సాహసాలే అతనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు సాధించి పెట్టింది. అతనే ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాయికిరణ్.

సాయికిరణ్‌ గిన్నిస్‌ రికార్డు

కిలిమంజారో నుంచి...

సాయికిరణ్ ఓ సాధారణ కూలీ కుమారుడు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం వారిది. అయితే అతడు అందరిలో ఒకడిలా మిగిలిపోకుండా... అందనంత ఎత్తుకు ఎదగాలనుకున్నాడు. ఎత్తైన పర్వతాలు అధిరోహించి మౌంటెనీర్‌‌‌‌‌‌‌‌ కావాలనుకున్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తున్నా ముందుకు సాగిన ఆ యువకుడు ఆత్మ‌విశ్వాసంతో మొక్క‌వోని దీక్ష‌తో విశ్ర‌మించ‌కుండా అనుకున్న ల‌క్ష్యాల‌ను ఛేధించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికా దేశంలో 5వేల 895 మీటర్ల ఎత్తు ఉన్న కిలిమంజారో పర్వతాన్ని మొదట అధిరోహించి భారత్ జాతీయ జెండాను రెపరెపలాడించాడు. ఆ తర్వాత సిక్కిం రాష్ట్రంలో 6వేల 010 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ టెంగ్విన్ పర్వతాన్ని అవలీలగా ఎక్కేశాడు. అనంతరం లడక్ ప్రాంతంలో 6153 ఎత్తులో ఉన్న స్టాక్ కాంగ్రి పర్వతాన్ని అధిరోహించి... అక్కడ 365 అడుగుల భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాడు. దీంతో అప్పట్లో హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాయికిరణ్ సాధించి.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు.

పర్వతారోహకుడు సాయికిరణ్‌ గిన్నిస్‌ రికార్డు

ఎవరెస్టే లక్ష్యం

తాజాగా ఈ ఏడాది ఆగస్టు 15న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులను గంట వ్యవధిలో వారి సాహస యాత్రకు సంబంధించిన ఫోటోలను ఫేస్​బుక్​లో అప్లోడ్ చేయాలని సూచించింది. గంట వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 995 మంది పర్వతారోహకులు తమ సాహస యాత్ర చిత్రాలను అప్​లోడ్ చేశారు. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం కొన్నింటిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎంపిక చేశారు. అందులో ఏపీ నుంచి గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆలూరి సాయి కిరణ్ ఉన్నాడు. 2 రోజుల కిందట లండన్ నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్ సంస్థ సాయి కిరణ్​కు రికార్డుతో కూడిన ధ్రువపత్రాన్ని పంపింది. దీంతో సాయికిరణ్ ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం సాయికిరణ్ గణపవరం సీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సీఆర్ కళాశాల యాజమాన్యం, తన గురువు శేఖర్ బాబు అందించిన ప్రోత్సాహంతోనే ఇవన్నీ సాధించ గలిగానని సాయి కిరణ్ తెలిపాడు. 2021 సంవత్సరంలో అన్నీ అనుకూలిస్తే ప్రపంచంలోనే అతి ఎత్తైన 8 వేల 848 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయడమే తన లక్ష్యమని సాయి కిరణ్ అంటున్నారు.

జాతీయ జెండాను రెపరెపలాడించిన సాయికిరణ్​

ఇవీ చూడండి: తెలుగు వైద్యుడికి బ్రిటన్​ ఉన్నత పురస్కారం

ABOUT THE AUTHOR

...view details