తెలంగాణ

telangana

By

Published : Aug 12, 2021, 6:31 AM IST

Updated : Aug 12, 2021, 6:56 AM IST

ETV Bharat / city

GSLV: మూడో దశలో సాంకేతిక లోపం.. దారితప్పిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే విఫలం అయింది. మూడో దశలో సాంకేతిక లోపంతో ఈ ప్రయోగం విఫలం అయిందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ తెలిపారు.

GSLV
GSLV

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ)-ఎఫ్‌10 వాహకనౌక ప్రయోగించిన కాసేపటికే విఫలం అయింది. ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీశ్​ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 ద్వారా ఈవోఎస్​-3ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. అయితే మూడో దశ అయిన క్రయోజనిక్‌ దశలో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రయోగం విఫలం అయిందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ తెలిపారు. ఫలితంగా ప్రయోగించాల్సిన దశలో కాకుండా రాకెట్​ మరో దిశలోకి వెళ్లినట్లు వెల్లడించారు. 38 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉప గ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా.. ప్రయోగం విఫలమైంది.

వైఫల్యంపై ఆరా..

ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రెజిల్‌ భూ పరిశీలనా ఉపగ్రహం అమెజోనియా-1, మరో 18 సహ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు.. జీఎస్​ఎల్​వీ-ఎఫ్​10 విషయంలో మాత్రం ఆశించిన ఫలితం రాలేదు. ఈ ప్రయోగం వైఫల్యంపై.. ఇస్రో శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు.

కక్ష్యలో ప్రవేశపెట్టడంలో విఫలం..

ఈవోఎస్​-3 ఉప గ్రహాన్ని అనేక ప్రయోజనాలు పొందేలా ఇస్రో రూపొందించింది. దేశ భూభాగం, సరిహద్దులు, అడవులకు సంబంధించి స్పష్టమైన ఛాయా చిత్రాలను పంపేలా తయారు చేశారు. కుంభవృష్టి, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులపై కూడా త్వరగా అప్రమత్తమయ్యేలా సమాచారం పొందే ఉద్దేశంతో రూపొందించారు. అయితే.. నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారు.

ఇదీ చదవండీ..Amit Sha Srisailam Tour: నేడు శ్రీశైలానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Last Updated : Aug 12, 2021, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details