Agnipath News: అన్యాయంచేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రఆగ్రహంతో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న కొందరు అభ్యర్థులు... భారీమూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అగ్నిపథ్ ప్రవేశంతో గతంలో రాసిన పరీక్షలు రద్దయ్యాయనే ఆక్రోశంతో.. విధ్వంస రచనకు పూనుకున్న వారిపై రైల్వేపోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాడిలో పాల్గొన్నారంటూ పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీసులు.. నిందితుల జాబితాను రూపొందిస్తున్నారు. అయితే వారిపై మాత్రం 14 సెక్షన్లను ప్రయోగించారు.
ఐపీసీలోని 143 సెక్షన్ ప్రకారం చట్టవ్యతిరేకంగా గుమిగూడటం, 147 సెక్షన్ ప్రకారం అల్లర్లకు పాల్పడటం, 324 నిబంధన ప్రకారం మారణాయుధాలతో దాడి కింద కేసు నమోదు చేశారు. 307సెక్షన్ ప్రకారం హత్యాయత్నం... 435 ప్రకారం పేలుడు పదార్థాలతో ఆస్తిని నష్టపరచడం, 427నిబంధన ప్రకారం ఆస్తలకు నష్టం కలిగించడం, 448 సెక్షన్ ప్రకారం... అనుమతి లేకుండా చొరబడటం కింద కేసు నమోదు చేశారు. 336 నిబంధన ప్రకారం ఇతరుల ప్రాణానికి హానికలిగించే చర్యకు పాల్పడటం, 332ప్రకారం విధినిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని గాయపరచడం కింద అభియోగం మోపారు. 341 రెడ్‌విత్ సహా 149 నిబంధన కింద సంయమనం కోల్పోవడం సెక్షన్లతోపాటు.. భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 150 ప్రకారం హానికరంగా రైలును ధ్వంసం చేయడం, 151 ప్రకారం రైల్వే ఆస్తుల నష్టం, 152 ప్రకారం రైల్వే ప్రయాణికులను గాయపరచడం, సెక్షన్ 3 ప్రకారం.. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం సెక్షన్లు ప్రయోగించారు.