రాష్ట్రంలో గ్రూపు-2 పోస్టులతో పాటు గ్రూపు-3లోని కొన్ని ముఖ్యమైన పోస్టులకు ఒకే నోటిఫికేషన్ జారీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు విభాగాల్లో కలిపి 1955 పోస్టులు మాత్రమే ఉన్నందున వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు తాజాగా ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా 582 గ్రూపు-2 పోస్టులు, 1373 గ్రూపు-3 పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే.
గ్రూపు-2 పరిధిలో పురపాలక కమిషనర్లు- గ్రేడ్ 3, ఏసీటీవో, సబ్‌రిజిస్ట్రార్- గ్రేడ్ 2, పంచాయతీ విస్తరణాధికారి, ఆబ్కారీ సబ్‌ఇన్‌స్పెక్టర్, నాయబ్ తహసీల్దార్, సహాయ రిజిస్ట్రార్, సచివాలయ సహాయ విభాగాధికారి, సహాయ కార్మిక అధికారి, సహాయ అభివృద్ధి అధికారి తదితర ఉద్యోగాలున్నాయి. గ్రూపు-3లో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆడిటర్, సహాయ ఆడిటర్, టైపిస్టు వంటి పోస్టులున్నాయి. వీటన్నింటికీ కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై సాధారణ పరిపాలనశాఖ ప్రతిపాదనలు రూపొందించి, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తుది అనుమతులు ఇచ్చాక నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.